పంచాయతీ పోరుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!!!

సోమవారం, 25 జనవరి 2021 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. 
 
దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని జస్టిస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్‌ కౌల్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
అంతకుముందు.. పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఎన్నికలపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పిటిషన్‌కు ముందే ఎస్ఈసీ కేవియట్‌ దాఖలు చేసింది. విచారణలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సుప్రీం కీల తీర్పును వెలువరించింది. 
 
ఇదిలావుంటే, స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ గోవా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తెరపైకి తెచ్చింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నందున్న స్థానిక ఎన్నికలను ఏప్రిల్ నాటికి గోవా ఎస్ఈసీ వాయిదా వేసింది. గోవా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు