దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి!!

సోమవారం, 25 జనవరి 2021 (08:17 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఢిల్లీ కేంద్రంగా ఉంది. అయితే, ఈ కోర్టు బెంచ్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ, దీనిపై పాలకల్లో ఏ ఒక్కరూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో సౌత్ ఇండియాలో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల చైర్మన్లు డిమాండ్ చేస్తున్నారు. 
 
దక్షిణ భారతదేశంలో సుప్రీం కోర్టు బెంచ్‌ను సత్వరమే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిలో సుప్రీం కోర్టు బెంచ్‌ నెలకొల్పడంపై తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు బి.కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్‌ నిర్వహించారు. 
 
ప్రధాన వక్తలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు బార్‌ కౌన్సిళ్ల చైర్మన్లు ఎ.నర్సింహారెడ్డి, జి.రామారావు, కేపీ జయచంద్రన్‌, పి.అమల్‌రాజ్‌ పాల్గొన్నారు. ఇందులో వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు అంశం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉందన్నారు. 
 
త్వరలో ఈ అంశంపై బార్‌ కౌన్సిళ్లు తీర్మానం చేసి భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.  సమావేశ సందర్భంగా దక్షిణాది సుప్రీంకోర్టు బెంచ్‌ సాధన సమితి కన్వీనర్‌గా తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు