అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యమేనా?

మంగళవారం, 8 జనవరి 2019 (08:56 IST)
సార్వత్రిక ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగాల్సివుంది. ఈ పరిస్థితుల్లో విపక్ష పార్టీలకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. అందేంటంటే.. దేశంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ)లకు 10 శాతం రిజర్వుషన్లు విద్యా, ఉద్యోగాల్లో కల్పించనున్నట్టు ప్రకటించారు. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది. మంగళవారం లోక్‌సభ ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో అసలు ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యమేనా అనే అంశంపై ఇపుడు చర్చ సాగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లను అనుసరించి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశ్యంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బీసీలకు 27 శాతం చొప్పున మొత్తం 49.5 శాతంగా ఉన్నాయి. అయితే, 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పది శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ప్రకటించారు. 
 
ఇప్పటికే అమలు చేస్తున్న రిజర్వేషన్‌లలో కోత విధించి 50 శాతం మించకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేక సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి రిజర్వేషన్లు 60 శాతానికి తీసుకెళతారా? అనేది స్పష్టంకావాల్సివుంది. అదేసమయంలో ఈబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అయింది.
 
అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు విధించిన తీర్పును అధిగమించేందుకు తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9 షెడ్యూల్‌లో చేర్చారు. ఇపుడు కేంద్రం కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు