అదే జరిగితే దేశ ప్రధానిగా నితిన్ గడ్కరీ.. ఎవరన్నారు?

సోమవారం, 7 జనవరి 2019 (12:54 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ అంటూ ఏర్పడితే దేశ ప్రధానమంత్రిగా నితిన్ గడ్కరీ ఉంటారని, హంగ్ ఏర్పడాలని కూడా నితిన్ గడ్కరీ కూడా కోరుకుంటున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదన్నారు. ఈ మేరకు ఆయన శివసేన పత్రికకు రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. అదేసమయంలో దేశంలోనేకాకుండా, బీజేపీలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రాభవం నానాటికీ తగ్గిపోతుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం రోజురోజుకూ బలపడుతున్నారన్నారు. 
 
అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ ఆధిక్యాన్ని కట్టబెట్టరనీ, దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీనేనని ఆయన వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెడితే మోడీ మాత్రం దాన్ని చేజేతులా వృధా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే భావనతో ఆనాడు మోడీకి ప్రజలు మద్దతు పలికారని... కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయిందని తెలిపారు.
 
ప్రత్యామ్నాయ నేతగా గడ్కరీని అంగీకరించేందుకు ఆరెస్సెస్, ఇతర బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. గడ్కరీ రెండోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగాకాకుండా రాజకీయ కుట్ర జరిగిందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడాలని గడ్కరీ వేచి చూస్తున్నారని... ఒకవేళ హంగ్ ఏర్పడితే... అత్యున్నత పదవిని (ప్రధాని) ఆయన చేపట్టే అవకాశం ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు