కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే, పలు రాష్ట్రాలు కేంద్రంతో సంబంధం లేకుండా తమతమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను పొడగించాయి.
లాక్‌డౌన్ మరో కొన్ని రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు పొడిగింపు యోచన చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ విషయంపై పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. లాక్‌డౌన్ పొడిగించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. సీఎం కేజ్రీవాల్ కూడా పొడిగింపునకే సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కరోనాకు సరైన చికిత్స లేకపోవడం, ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఈ యోచనలో ఉన్నట్లు తెలిపారు.
అలాగే, మహారాష్ట్రలో పరిస్థితులు ఇప్పటికే చేజారిపోయేలా ఉండటంతో లాక్‌డౌన్ పొడిగింపు తప్ప మరో దారి ఆ రాష్ట్ర పాలకులకు కనిపించడంలేదు. లాక్‌డౌన్ ఎత్తేస్తే పరిస్థితులను అదుపుచేయలేమనే అధికారులు భావిస్తున్నారు. అలాగే, కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పొడిగిస్తామనే సంకేతాలే ఇస్తున్నాయి.