వేటగాళ్ళనే వేటాడిన వేటగాడు అతను...

సోమవారం, 11 మార్చి 2019 (16:17 IST)
పాకిస్థాన్ చెర నుంచి బయటపడిన తమ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత వైమానికదళం ప్రశంసల వర్షంలో ముంచెత్తింది. వేటగాళ్ళనే వేటాడిన వేటగాడు అంటూ తమ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 
 
"భారత్‌ను వేటాడేందుకు వచ్చిన వారిని మీరు వేటాడారు" అని పేర్కొంటూ హిందీలో రాసిన ఒక పద్యాన్ని ఐఏఎఫ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బిపిన్ అల్హాబాదీ అనే కవి సబ్‌కే బస్ కీ బాత్ నహీ (ఇది అందరివల్లా కాదు) అనే శీర్షికన ఈ పద్యాన్ని రాశారు. 
 
'అభినందన్ అందరిలాంటి వ్యక్తి కాదని, వేటగాళ్లనే వేటాడిన వ్యక్తి' అని ఆ పద్యం పేర్కొంది. గత నెల 14న పుల్వామా ఉగ్ర దాడి తర్వాత 26న పాక్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
 
ఆ మరుసటి రోజే పాక్ తన యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి ప్రయత్నించింది. ఈ క్రమంలో భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్-21 యుద్ధ విమానంతో అభినందన్ వెంటాడి కూల్చేశాడు. 
 
ఈ క్రమంలో పాక్ యుద్ధ విమానాలు కూడా అభినందన్ నడుపుతున్న మిగ్ యుద్ధ విమానాన్ని కూల్చేయగా, పారాచూట్ సాయంతో ఆయన ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ పాక్ సైనికులకు బందీగా చిక్కారు. తర్వాత శాంతి ప్రక్రియలో భాగంగా ఈ నెల ఒకటో తేదీన భారత్‌కు అభినందన్ తిరిగొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు