సోమవారం నుంచి "మన" అందిస్తున్న మంథరువు "మంథర" సీరియల్

శనివారం, 26 నవంబరు 2011 (15:40 IST)
PR
సీరియల్సంటే - అత్తాకోడళ్ల కథలు, భార్యాభర్తల వ్యధలే కాదు. కొత్తగా కూడా చెప్పొచ్చంటూ సరికొత్త సీరియల్‌తో ముందుకొస్తున్నారు 'మన' సంస్థ యం.డి, నిర్మాత - 'మన' చౌదరి. మన అడ్వర్టైజింగ్ సంస్థ ద్వారా విశేష ప్రజాదరణ పొందిన 'చి|| ల|| ౌ|| స్రవంతి' లాంటి పలు సీరియల్స్‌ని గతంలో ఈయన అందించారు.

వచ్చే సోమవారం నుంచి జెమిని టీవీలో సాయంత్రం 7 గం.లకి ప్రసారం కానున్న 'మంథర' సీరయల్ గురించి 'మన' చౌదరితో ముఖాముఖి.

సీరియల్‌కు 'మంథర' అనే నెగిటివ్ టైటిల్ పెట్టారు.. ఏమిటీ మీ సాహసం?
'ధైర్యే సాహసే లక్ష్మి' అనే మాటను నేను బలంగా నమ్ముతాను. నా నమ్మకాన్ని ఎప్పుడూ ప్రేక్షకులు నిలబెడుతూనే ఉన్నారు.

రామాయణంలో మంథరకి మీ సీరియల్ కథకి ఏదైనా పోలిక ఉంటుందని అనుకోవచ్చా..?
పాత్ర స్వభావంలో పోలిక తప్ప కథాపరంగా ఏ సంబంధం ఉండదు. సాధారణంగా కథని పాజిటివ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం. కానీ ఈ కథ నెగిటివ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది.

మరి సెంటిమెంట్ ఉండదా?
మానవ సంబంధాలకి మూలాధారం సెంటిమెంట్‌. దాన్ని నేను బలంగా నమ్ముతాను. అది లేకపోతే కథ అనేది ప్రాణంలేని శరీరంలా ఉంటుంది. అంతెందుకు ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి మనలో ఎన్ని సెంటిమెంట్స్ తొంగిచూడటం లేదూ... అలాంటి కోణాలన్నీ మంథరలో ఆవిష్కరిస్తున్నాం.

మీరు అన్ని విభాగాల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు?
అన్ని విభాగాల్ని ప్రేమిస్తా, కాని అగ్రతాంబూలం ఇచ్చేది మాత్రం కథ, స్క్రీన్‌ప్లేలకే.

ప్రేక్షకులకు మంథర గురుంచి ఏమైనా చెప్తారా?
చెప్పను... ఎందుకంటే నేను ప్రేక్షకుడినే. ప్రేక్షకులు ఎప్పుడూ తెలివైనవాళ్లే.. వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్తదనాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే 'మంథర' లాంటి సీరియల్ తీసాను. దానికి వచ్చే ఆదరణను మీరు త్వరలోనే చూస్తారు... అంటూ 'మన చౌదరి' ముగించారు.
PR