బడ్జెట్ 2014 : ప్రణబ్ - చిదంబరంలను బీట్ చేసిన జైట్లీ!

గురువారం, 10 జులై 2014 (18:32 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో మాజీ ఆర్థిక మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సిన్హాలను ఓడించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు చదివిన బడ్జెట్‌లలో అరుణ్ జైట్లీదే అతిపొడవైన బడ్జెట్‌గా రికార్డుకెక్కింది. గురువారం సరిగ్గా 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన అరుణ్ జైట్లీ.. మధ్యలో ఐదు నిమిషాల పాటు విరామం తీసుకుని తర్వాత మధ్యాహ్నం 1.15 నిమిషాలకు తన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని పూర్తి చేశారు. 
 
అరుణ్ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో మొత్తం 16356 పదాలు ఉన్నాయి. ఇంత పొడవైన బడ్జెట్‌ను చదవడం ఇదే తొలిసారి. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సిన్హాలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వీరిలో యశ్వంత్ సిన్హా 15882 పదాలతో కూడిన బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. అలాలగే, జశ్వంత్ సింగ్ 15081 పదాలతో కూడిన ప్రసంగం చేశారు. 
 
ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో చిదంబరం లేదా ప్రణబ్ ముఖర్జీలు ఆర్థిక మంత్రులుగా పని చేశారు. వీరిద్దరు కూడా 14157 పైచిలుక పదాలతో కూడిన బడ్జెట్‌ ప్రతులను చదివి వినిపించారు. అయితే, ప్రణబ్ ముఖర్జీ ప్రసంగ పాఠాన్ని చదివేందుకు కాస్త ఇబ్బంది పడగా, చిదంబరం మాత్రం అనర్గళంగా చదివి వినిపించారు. 

వెబ్దునియా పై చదవండి