బడ్జెట్ బాదుడు ఈసారి భిన్నంగా వుండబోతోందంటున్నారు విశ్లేషకులు. ఫర్నీచర్, పారిశ్రామిక రసాయనాలు, నగలు, ఫోన్ చార్జెర్స్, చేతితో తయారు చేసిన వస్తువులు మరో 40కి పైగా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనితో వీటిని కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది షాకిచ్చేదిగా వుండబోతోంది.
మరోవైపు వేతన జీవులకు ఊరటనిచ్చే దిశగా ఈసారి మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని చెపుతున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన టాక్స్ శ్లాబుల వల్ల వేతన జీవులపై పన్ను బాదుడు అంత తక్కువేమీ లేదన్న వాదనలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈసారి మరికాస్త కసరత్తు చేసి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు బేసిక్ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా వుండగా దీన్ని రూ 3 లక్షలు లేదా రూ 3.5 లక్షలకు పెంచుతారని అంచనా వేస్తున్నారు. ఆదాయపన్ను శ్లాబులు, పన్ను రేట్లలో మార్పులు తీసుకొచ్చేందుకు మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రకారం ఈసారి రూ.7 లక్షల దాకా ఆదాయం ఉన్న వారికి 5 శాతంగా పన్ను వుండనుందని అంచనా. అలాగే 7 నుంచి 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న 5, 20, 30 శాతం శ్లాబులు పన్ను భారాన్ని విపరీతంగా పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన నేపధ్యంలో ఈమేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.