బడ్జెట్ 2021 : రైల్వేకు రూ.1.15 లక్షల కోట్లు - స్వదేశీ ఎయిర్‌పోర్టులన్నీ ప్రైవేటు పరం

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (11:54 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి రైల్వేలతో పాటు ప్రజా రవాణాకు పెద్ద పీట వేశారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా భార‌తీయ రైల్వేల‌ను అభివృద్ది చేసేందుకు భారీ స్థాయిలో నిధులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే రంగంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.1.15 ల‌క్ష‌ల కోట్ల నిధులు అందించ‌నున్నారు. దేశీయ విమానాశ్ర‌యాల‌ను పూర్తిగా ప్రైవేటీక‌రించ‌నున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. 
 
ఇకపోతే, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రజా రవాణాకు 2021-22 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రోడ్డు రవాణా, రహదారులకు రూ 1.18 లక్షల కోట్లు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా బడ్జెట్‌లో పలు చర్యలు చేపట్టామని వివరించారు.
 
అలాగే, ఆరోగ్య భార‌త్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌ధాన‌మంత్రి ఆత్మ‌నిర్బ‌ర్ స్వ‌స్త్ భార‌త్ యోజ‌న పేరుతో ఆ స్కీమ్‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఈ కొత్త ప‌థ‌కం కోసం రూ.64,180 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తారు. ఆరోగ్యం విష‌యంలో కేంద్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 
 
ఈ కొత్త పథకానికి కేటాయించిన నిధుల‌తో ప్రైమ‌రీ, సెకండ‌రీ హెల్త్ కేర్ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న జాతీయ సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డమే కాకుండా.. కొత్త ఆరోగ్య సంస్థ‌ల‌ను స్థాపించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి సీతారామ‌న్ వెల్ల‌డించారు.
 
కొత్త వ్యాధుల‌ను గుర్తించ‌డం, వాటికి చికిత్స‌ను ఇవ్వ‌డం వంటి ప‌రిశోధ‌న‌ల గురించి ఈ స్కీమ్ కింద నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌కు తోడుగా ఈ స్కీమ్ ఉంటుంద‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 17,788 సెంట‌ర్లు,  ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉన్న 11,024 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంట‌ర్ల‌ల‌కు చేయూత ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. 
 
అన్ని జిల్లాల్లో హెల్త్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోతో పాటు 20 మెట్రోపాలిట‌న్ హెల్త్ స‌ర్వియ‌లెన్స్ యూనిట్ల‌ను బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య స‌మాచారంతో ఓ ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను రూపొందించ‌నున్నార‌ని, దానితో అన్ని ప‌బ్లిక్ హెల్త్ ల్యాబ్‌ల‌ను అనుసంధానించ‌నున్న‌ట్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు