వీధి పోట్లు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి... తెలుసా...?

సోమవారం, 24 అక్టోబరు 2016 (14:31 IST)
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఎదురుగా నిలువుగా ఉన్నవీధి ఇంటివరకూ వచ్చి ఆగిపోయినా, లేదా ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటు ఉన్న ఇల్లు అంటారు. వీధిపోటు ఉన్న ఇల్లు బొత్తిగా నివాసయోగ్యం కాదనీ, ఆ ఇంట కాపురముండే వారు అష్టకష్టాలు పడతారని చాలామంది అపోహపడుతుంటారు. ఈ అపోహల మూలంగా నిరంతరం మానసిక అశాంతికి గురై తక్కువ ధరకే ఇల్లు అమ్ముకుపోయేవారు కొందరైతే , రిపేర్ల పేరిట బోలెడంత డబ్బు ఖర్చు చేసి ఆర్ధికంగా నష్టపోతుంటారు. అయితే నిజానికి ఏ దిశలో వీధిపోటు ఉన్నాదనే అంశం మీదే ఆయా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
 
ఇంటికి తూర్పు మొగ్గున్న ఈశాన్య వీధిపోటు సానుకూల ఫలితానిస్తుంది. ఈ ఇంటిలోని పురుషులు ఇంటా బయటా చక్కని గౌరవం, అధికారాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమతమ రంగాల్లో అత్యున్నత విజయాలను సాధిస్తారు. ఇంటికి ఉత్తరం మొగ్గున్న ఈశాన్య వీధిపోటు కూడా మంచిదే. ఈ ఇంటిలోని స్త్రీలు అన్నివిధాలా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని చీకూ చింతా లేకుండా జీవితాన్ని గడపటమే గాక కుబేర అనుగ్రహాన్ని పొందుతారు. 
 
ఇంటికి ఉత్తరం మొగ్గున్న వాయువ్య వీధి పోటు ఉంటే ఆ కుటుంబంలో ఉన్న యుక్తవయస్కులకు పెళ్లి కుదరకపోవటం, కుదిరినా ఆగిపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇంటి మహిళలు అనైతిక విషయాల పట్ల ఆకర్షితులు కావటంతో బాటు ఎప్పుడూ ఏవో తెలియని సమస్యలతో జీవితాన్ని గడపాల్సివస్తుంది.
 
ఇంటికి పడమర వైపు మొగ్గున్న వాయువ్య మూలన వీధిపోటు ఉంటే ఆ ఇంట అన్నీ సానుకూల ఫలితాలే. ఆ యజమాని కీర్తిని, ధనాన్ని ఆర్జిస్తాడు. అందరి ఆమోదాన్ని పొందిన వ్యక్తులుగా వీరు రాజకీయాల్లో చక్కని రాణింపును పొందుతారు. ఇంటికి పడమర మొగ్గున్ననైరుతి వీధిపోటు ఉన్న ఇంట ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనం మాత్రం ఉండదు. ఇంటికి దక్షిణం మొగ్గున్ననైరుతి వీధిపోటు కూడా అశుభాలకే దారి తీస్తుంది. దంపతుల మధ్య కలహాలు, ఆ ఇంట ఉండే స్త్రీలకు ఎప్పుడూ ఏదో ఒకరకమైన అనారోగ్యం ఉంటాయి. తలపెట్టిన ప్రతిపనిలోనూ అవాంతరాలను ఎదుర్కొంటారు. 
 
ఇంటికి దక్షిణం మొగ్గున్న ఆగ్నేయ వీధిపోటు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ ఇంట కాపురముండే కుటుంబం తృప్తికరంగా, సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ ఇంటివారు బంధువులను చక్కగా ఆదరిస్తారు. ఈ ఇంట తలపెట్టిన ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంటికి తూర్పు మొగ్గున్నఆగ్నేయ వీధి పోటు అనేక సమస్యల్ని సృష్టిస్తుంది. మానసిక అశాంతి, ఆదాయానికి మించిన ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వంటి సమస్యలకు కారణమవుతుంది.

వెబ్దునియా పై చదవండి