ఈశాన్యదిశ మెరక కలిగి వున్నట్లైతే ధనహాని, ఐశ్వర్యనాశనము, అనేక నష్టములు, కష్టములు, కలుగుచుండగలవు. ఈశాన్యము పల్లముగా నుండిన సర్వసౌభాగ్యములు, సుఖభోగములు, ధర్మబుద్ధి, కీర్తిప్రతిష్టలు, ధనధాన్యసంపదలు వృద్ధి కల్గుచుండును.
ఈశాన్య దిశ యందు దిబ్బలు, పేడకుప్పలు, రాళ్ళ గుట్టలు మొదలైనవి కల్గియున్నట్లైతే సుఖహీనత, నీచప్రవర్తన, విరోధములు, ఆయుక్షీణములు సంభవించి దరిద్రులు కాగలరు. ఈశాన్యము మెరక కల్గియున్నను, పల్లముగానున్నను అందుపాకలు, పందిళ్లు ఇతర కట్టడములు, బరువులు కల్గియున్న - దరిద్రము, కీడు, భార్యలేక గృహయజమానురాలికి తీవ్ర అనారోగ్యము, పుత్రనష్టము సంభవింపగలదు.
ఈశాన్యమునందు బావియుండుట ఐశ్వర్యప్రదము. వర్షపు నీరు, వాడుకనీరు పోవు కాల్వలు, గోతులు, జలాశయములు యుండుట వలన వంశవృద్ధి కల్గి, ధనదాన్య సంపదలు వృద్ధినందగలవు. ఈశాన్యంలో నీళ్ళకుండీలు భూమట్టమునకు తక్కువగా నిర్మించుకొనవచ్చును. వాటర్‌టాంక్‌లు నిర్మింపరాదు. మరుగుదొడ్లు నిర్మించిన యెడల కుటుంబకలహములు, నష్టములు, సంతతికి కీడు కలుగ గలదు.
ముఖ్యముగా స్థలమందుగానీ, గృహమందుగానీ, గదులలో గానీ ఈశాన్యమూలన ఏ విధములైన కట్టడములు నిర్మించుట ద్వారములుండుట, బరువులుండుట మొదలైనవి శాస్త్ర విరుద్ధము. ఈశాన్యమందు ఖాళీగా వుంచుట శ్రేయస్కరము. ఈశాన్యదిశ పల్లము కల్గియుండు నట్లు గృహనిర్మాణ మొనర్చినట్లైతే అఖండ ఐశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.