జీడిపప్పులోని ప్రతి గ్రాములో తొమ్మిది కెలోరీలు ఉన్నాయి. ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్ కలిగివున్న జీడిపప్పులో ఫాట్ ఎక్కువ. అందుచేత పిల్లలకు పోషకాల కోసం వారానికోసారి వంటల్లో వాడవచ్చు. అలాగే వంకాయలో ఔషధ గుణాలెన్నో దాగివున్నాయి. కేన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్‌కు వంకాయ చెక్ పెడుతుంది. ఇంకేముంది.. జీడిపప్పు ప్లస్ వంకాయ.. ఈ రెండింటితో కూర చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా.
కావలసిన పదార్థాలు : వంకాయలు - పావు కేజీ. జీడిపప్పు - వంద గ్రాములు. ఉప్పు - తగినంత. పసుపు - చిటికెడు.
పోపుకు కావాల్సినవి : ఎండిమిర్చి - నాలుగు ఆవాలు - అర టీ స్పూన్. అల్లం - చిన్న ముక్క. పచ్చిమిర్చి - రెండు. నూనె - తాలింపుకు తగినంత మినప పప్పు - ఒక టీ స్పూన్. జీలకర్ర - పావు టీ స్పూన్. శనగపప్పు - ఒక టీ స్పూన్. కరివేపాకు - కొద్దిగా. కొత్తమీర - కొద్దిగా.
తయారీ విధానం : ముందుగా ఉప్పు వేసిన నీటిలో తరిగిన వంకాయ ముక్కలు వేయాలి. జీడిపప్పును పొట్టు తీసుకుని ముక్కలు చేసుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి వేగాక, జీడిపప్పు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి సన్న సెగలో మూత పెట్టి మగ్గించాలి. ఆఖరున దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.