కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

గురువారం, 13 సెప్టెంబరు 2018 (11:23 IST)
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి ఆలయం సత్యప్రమాణాలకు నిలయంగా ఉంది. దేశంలోనే ప్రముఖమైన వినాయక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ స్వామికి ప్రతీ ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా, వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ వేడుకలు 21 రోజుల పాటు అంటే అక్టోబరు 3వ తేదీ వరకు జరుగనున్నాయి.
 
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, గురువారం తెల్లవారుజాము నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  
 
ఇక కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు పరిశీలించినట్లయితే గురువారం వినాయకచవితి ద్వజారోహాణం ఉంటుంది. శుక్రవారం హంస వాహానంపై గణపతి ఊరేగుతారు. 
 
15వ తేదీన వాహనం, 16న మూషిక వాహనం, 17న శేష వాహనం, 18న వృషభ వాహనం, 19న గజ వాహనం, 20న రథోత్సవం, 21న అశ్వవాహనం, 22న ధ్వజ అవరోహణం, 23న అధికార నంది వాహనం, 24న రావణ బ్రహ్మ వాహనం, 25న యాళి వాహనం, 26న సూర్యప్రభ వాహనం, 27న చంద్ర ప్రభ వాహనం, 28న విమానోత్సవం, 29న పుష్ప పల్లకీ సేవ, 30న కామదేను వాహనం, అక్టోబరు ఒకటో తేదీన కల్పవృక్ష వాహనం, అక్టోబర్‌ 2న పూలంగి సేవ, అక్టోబర్‌ 3న తెప్పోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు