వినాయకచవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో?

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:29 IST)
గణపతి సకల దేవతలకు గణ నాయకడు. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని పూజిస్తుంటారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందుగా గణపతిని పూజించినట్లుగా చెప్పబడింది. అటువంటి వినాయకుని పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు.
  
 
గజముఖుడనే రాక్షసుడు పరమ శివుని తన తపస్సుచే మెప్పించి ఆ స్వామి ఉదరంలో ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. ఈ విషయంపై పార్వతీ దేవి ఆందోళనను శ్రీ మహా విష్ణువునకు తెలియజేశారు. అప్పుడు విష్ణువు నందిగా, బ్రహ్మ గంగిరెద్దుగా మారుతారు. విష్ణువు బ్రహ్మ గంగిరెద్దును ఆడించువారిలా వెళ్ళి ఆ గజముఖుని నివాస ప్రాంతానికి చేరుకున్నారు. ఆ రాక్షసుడు గంగిరెద్దును చిత్ర విచిత్రాలుగా ఆడించాడు.  
 
గజముఖుడు ఆ సమయంలో సంతోషించి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. నీ కడుపులో గల శివునిని ప్రసాదించమని వారు కోరుతారు. అప్పుడు గజముఖుడు వచ్చిన వారు ఎవరనేది తెలుసుకుంటాడు. దాంతో తన శిరస్సు పరమ పూజనీయం కావాలనీ, తన చర్మం శివుడు ధరించాలనే వరాలను కోరి శివుడిని వారికి అప్పగించి తన ప్రాణాలు వదలుతాడు. 
 
కైలాసంలో పార్వతీ శివుని కోసం ఎదురుచూస్తూ నలుగుపిండితో స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారచేసి దానికి ప్రాణం పోసి వాకిట్లో కాపలాగా ఉంచి వెళుతుంది. అంతలో అక్కడికి శివుడు రాగా ఆ బాలుడు ఆయనను అడ్డుకున్నాడు. కోపానికి లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంచే ఖండించారు. ఆ శబ్దానికి పార్వతి బయటకు వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. 
 
దాంతో శివుడు గజముకుని శిరస్సును తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి అతనికి గజాననడు అనే పేరును పెట్టాడు. ఆ బాలుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించిన శివుడు అతనిని గణాధిపతిగా పరిగణించారు. దాంతో దేవతలు గణేశునికి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ విందును కడుపారా భోంచేసిన గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి శివుని శిరస్సున గల చంద్రుడు నవ్వుతాడు. దాంతో గణపతికి దిష్టి తగిలి పొట్ట పగిలిపోతుంది. తన కుమారుడిని తిరిగి బ్రతికించుకున్న ఆ తల్లి పార్వతీ దేవి భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు నీలాపనిందలను ఎదుర్కుంటారని శపిస్తుంది. 
 
ఐతే దేవతలంతా కలిసి పార్వతికి నచ్చచెప్పడంతో ఆ రోజున వినాయకవ్రత కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఈ శాపం వర్తించదని చెపుతుంది. ఐతే పాల పాత్రలో ఆ రోజున చంద్రుడిని చూసినందుకు గాను శ్రీ కృష్ణుడంతటి వారు కూడా నీలాపనిందలను మోయవలసి వచ్చింది. ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు, మానవులు ఈ రోజున వినాయకుడిని పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించసాగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు