ఆమెకు అందాల కిరీటం వరించినా.. ఆర్మీ వైపు అడుగులు వేసింది..

మంగళవారం, 19 మార్చి 2019 (18:19 IST)
అమ్మాయి చూస్తే కుందనపు బొమ్మలా ఉంది. ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి అందాల పోటీలో గెలిచింది. అయినా ఆర్మీలో లెఫ్టినెంట్ బాధ్యతలు చేపట్టింది. ఆమె పేరు గరీమా యాదవ్. ఈ మధ్యే శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరింది. అందాల కిరీటం ధరించినప్పటికీ, దేశానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఆర్మీ వైపు అడుగులు వేసింది. 
 
గరిమా ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కమిషన్‌ను పూర్తి చేసింది. దీంతో ఆమెకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సీటు లభించింది. గరిమా సరదాగా ఓసారి మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్ 2017 పోటీల్లో పాల్గొని, ఆ పోటీలలో విజేతగా నిలిచింది.
 
తెలివితేటలతో పాటు అందంగా ఉండడంతో ఆమెకు అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇటలీలో జరుగుతున్న ఆ పోటీలకు హాజరుకావాలంటే ఇక్కడ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వచ్చిన సీటును వదులుకోవాలి. అయితే గరీమాకు అది ఇష్టం లేదు. ఆత్మ సంతృప్తి అనేది అందాల పోటీల ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు, డబ్బు కంటే విలువైంది అని గ్రహించి ఆర్మీనే కెరీర్‌గా ఎంచుకుని అకాడమీలో చేరింది.
 
శిక్షణ సమయంలో కష్టం అనిపించినప్పటికీ వెనుకడుగు వేయలేదు. పట్టుదలతో అన్ని ఈవెంట్‌లను పూర్తి చేసింది. సర్వీస్ సెలక్షన్ బోర్డులో ఎంపిక అయ్యేందుకు శారీరక ధృఢత్వానికి ఎలాంటి సంబంధం లేదు. బలహీనతలు తెలుసుకుని వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తే, ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు అందుకోవచ్చని గరీమా యాదవ్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు