జన సంద్రాన్ని తలపిస్తున్న ఇడుపులపాయ

శుక్రవారం, 4 సెప్టెంబరు 2009 (13:25 IST)
రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్న జనహృదయ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కడసారి దర్శనం చేసుకుని, కన్నీటి వీడ్కోలు పలికేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో వైఎస్సార్ అత్యంత ప్రీతిప్రాయమైన ఇడుపులపాయ ఎస్టేట్ కడప జిల్లా వాసులతో కిక్కిరిసి పోయింది.

వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతో ఇష్టపడే ఆయన సొంత ఎస్టేట్‌లో శుక్రవారం సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తమ అభిమాన నాయకుని అంతియాత్రలో పాల్గొనాలని, ఈ కష్టకాలంలో వైఎస్ కుటుంబ సభ్యులకు సహానుభూతి ప్రకటించాలన్న ధ్యేయంలో వేలాది మంది ఇడుపులపాయ తరలివస్తున్నారు.

కాలినడక కొందరు, ఎద్దుల బండ్లపై మరికొందరు, ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాలు, లారీలు, బస్సులు ఇలా.. ఒకటేంటి తమకు అందుబాటులో ఉన్న వాహనాల్లో ఇడుపులపాయ వైపు పయనమవుతున్నారు. ఫలితంగా ఇడుపులపాయకు వెళ్లే రహదారులన్నీ వాహనాలు, జనాలతో కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి