వైఎస్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉంచారు. ఆయన భౌతికకాయాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దర్శించి నివాళులర్పించారు.

ఆద్యంతం కన్నీటి పర్యంతమవుతున్న జగన్‌ను కేవీపీ రామచంద్రరావు ఓదార్చారు. వైఎస్ భౌతిక దేహాన్ని చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు జగన్‌కు ఈ సందర్భంగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వైఎస్‌కు నివాళులర్పించిన వారిలో స్పీకర్ ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి, ప్రముఖ నిర్మాత రామా నాయుడు, దర్శకులు దాసరి, చంద్రబాబు తనయుడు లోకేష్‌, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ వైఎస్ మృతదేహాన్ని దర్శించి, జగన్ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

మెదక్ ఎంపీ విజయశాంతి, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, సినీ నటులు రాజా, జగపతిబాబు, తదితరులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ భౌతికకాయాన్ని దర్శించారు.

ఇదిలావుండగా వైఎస్ భౌతిక కాయాన్ని చూసేందుకు తరలి వస్తున్న అశేష ప్రజల సందర్శనార్థం లేజర్ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. తమ ప్రియతమ ముఖ్యమంత్రికి నివాళులర్పించేందుకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు.

కాగా అక్కడి వాతావరణం చూస్తుంటే భూమి ఈనిందా అన్నంతగా జనాలు క్రిక్కిరిసి ఉన్నారు. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాం.

వెబ్దునియా పై చదవండి