వైఎస్సార్ మృతి: డీకోడింగ్ ప్రారంభించిన డీసీజీఏ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని బలిగొన్న హెలికాఫ్టర్ ప్రమాదంపై అధికారిక యంత్రాంగం దర్యాప్తు చర్యలను ముమ్మరం చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు చెందిన కమిటీ వైఎస్సార్ మృతిపై దర్యాప్తు ప్రారంభించింది. డీజీసీఏ కమిటీ శనివారం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) డీకోడింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది.

ఇదిలా ఉంటే వైఎస్సార్‌ను బలిగొన్న హెలికాఫ్టర్‌లోని కీలకమైన ఎమర్జెన్సీ అలారం పరికరాన్ని ఇప్పటికీ గుర్తించాల్సి ఉంది. నలుగురు సభ్యుల డీజీసీఏ బృందం కాక్‌‍పిట్ వాయిస్ రికార్డర్‌ను ఢిల్లీ తీసుకెళ్లింది. ఇందులోని డేటాను వారు డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని కనుగొంటారు. వైఎస్సార్ హెలికాఫ్టర్ కూలిపోవడంపై జరుగుతున్న దర్యాప్తుకు ఈ సమాచారం కీలకం కానుంది.

వైఎస్సార్ హెలికాఫ్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు డీజీసీఏ బృందం సెప్టెంబరు 3న కర్నూలు వచ్చింది. వారికి జిల్లా అధికారిక యంత్రాంగం కూలిపోయిన బెల్- 430 హెలికాఫ్టర్ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను అందజేసింది. దీంతోపాటు ఇతర పత్రాలను శుక్రవారం వారికి అందజేశామని కర్నూలు కలెక్టర్ ముకుల్ కుమార్ మీనా ఓ వార్తా సంస్థకు ఫోన్‌లో చెప్పారు.

ఇదిలా ఉంటే హెలికాఫ్టర్‌కు చెందిన ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్స్‌‍మిటర్ (ఈఎల్‌టీ)ను ఇప్పటికీ నల్లమల అడవిలో గుర్తించాల్సి ఉంది. క్రాష్ ల్యాండింగ్ సిగ్నల్స్‌ను ఇది పంపుతుంది. ఈఎల్‌టీ ఎటువంటి సంకేతాలు పంపలేదని, క్రాష్‌లో ఇది దెబ్బతినివుండవచ్చని మరో అధికారి అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్సార్, మరో నలుగురు అధికారులతో హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న హెలికాఫ్టర్ బుధవారం ఉదయం నల్లమల అడవిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వైఎస్సార్‌తోపాటు, మిగిలిన నలుగురు కూడా మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి