కరోనావైరస్‌తో ప్రపంచ దేశాలు చేస్తున్న యుద్ధంలో రోబో సైనికులు
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (23:15 IST)
''దయచేసి ఈ గది విడిచి వెళ్లండి. తలుపు మూయండి. డిసిన్ఫెక్షన్ ప్రారంభించండి'' అని చెప్తుంది ఒక స్వరం. అది ఒక రోబో. ''ఇప్పుడిది చైనీస్ భాషలో కూడా చెప్తుంది'' అని తెలిపారు యూవీడీ రోబోస్ వైస్ ప్రెసిడెంట్ సైమన్ ఎలిసన్. ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో ఆయన నాకు వివరించారు. తలుపులు మూసేసిన ఒక గదిలో ఈ యంత్రం తనకు తానుగా తిరుగుతూ సూక్ష్మజీవులను సంహరించటానికి అతినీలలోహిత కాంతిని ఉపయోగిస్తుండటం.. గాజు కిటికీ నుండి మేం వీక్షించాం.
''ఈ వ్యాపారం చాలా వేగంగానే పెరుగుతూ ఉంది. కానీ, కరోనావైరస్ కారణంగా ఈ రోబోల కోసం డిమాండ్ ఒక్కసారిగా నింగికి ఎగసింది'' అని చెప్పారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెర్ జూల్ నీల్సన్. చైనాకు, ప్రత్యేకించి వూహాన్ నగరానికి ట్రక్కుల కొద్దీ రోబోలను ఎగుమతి చేశామని తెలిపారు. ఆసియాలోని ఇతర ప్రాంతాలతో పాటు యూరప్‌లో కూడా అమ్మకాలు పెరిగాయన్నారు.
''ఇటలీ నుంచి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. వాళ్లు ఇప్పుడు చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. మేం వారికి సాయపడాలనుకుంటున్నాం'' అని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది. డెన్మార్క్‌లోని ఓడెన్స్ నగరంలో గల ఫ్యాక్టరీలో రోజుకు ఒక రోబోను అసెంబుల్ చేస్తున్నారు. ఈ నగరం రోబోటిక్స్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది.
నిలువుగా ఉండే ఎనిమిది బల్బులు యూవీ-సీ అల్ట్రావయొలెట్ లైట్ (అతినీలలోహిత కాంతి)ని విడుదల చేస్తాయి. ఈ కాంతి బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికర సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. వాటిలోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను ధ్వంసం చేయటం ద్వారా అవి వృద్ధి చెందకుండా నిర్వీర్యం చేస్తుంది. ఆ కాంతి మనుషులకు కూడా హానికరమే. అందుకే, మేం వెలుపల వేచివున్నాం. కేవలం, 10-20 నిమిషాల్లో పని పూర్తయింది. ఆ తర్వాత ఒక వాసన... వెంట్రుకలు కాలినట్లు అనిపించే వాసన ఉంది.
''ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే సమస్యాత్మక జీవాలు చాలా ఉన్నాయి'' అని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్‌కు చెందిన క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ హాన్స్ కోల్మోస్ వివరించారు. ఈ రోబోను తయారు చేయటానికి ఈ వర్సిటీ సాయపడింది. ''అటువంటి జీవుల మీద సరైన మోతాదులో నిర్ణీత సమయం పాటు అతినీలలోహిత కాంతిని ప్రసరిస్తే.. వాటిని వదిలించుకోవచ్చు'' అని ఆయన తెలిపారు.
ఈ తరహా డిజిన్ఫెక్షన్ ప్రక్రియను.. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కరోనావైరస్ వంటి మహమ్మారి మీద కూడా ఉపయోగించవచ్చునని పేర్కొన్నారు. యూవీడీ రోబోస్ మాతృసంస్థ బ్లూ ఓషన్ రోబోటిక్స్, ఓడెన్స్ యూనివర్సిటీ హాస్పిటల్ సంయుక్తంగా ఆరేళ్ల పాటు శ్రమించి 2019లో ఈ రోబోను ఆవిష్కరించారు. ఆ హాస్పిటల్‌లో ఇన్‌ఫెక్షన్ కంట్రోల్‌ను ప్రొఫెసర్ కోల్మోస్ పర్యవేక్షించేవారు.
ఒక్కో రోబో ధర 67,000 డాలర్లు (రూ. 50 లక్షలు పైనే). హాస్పిటళ్లలో ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలను తగ్గించటానికి ఈ రోబోను రూపొందించారు. హాస్పిటళ్లలో సోకే ఇన్‌ఫెక్షన్లు ప్రాణాంతకంగా ఉంటాయి. వాటికి చికిత్స చేయటం కూడా చాలా వ్యయప్రయాశలతో కూడుకున్నది. కరోనావైరస్ మీద కూడా ఈ రోబో సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించటానికి నిర్దిష్ట పరీక్ష ఏదీ ఇంతవరకూ నిర్వహించలేదు. అయితే.. ఇది సమర్థంగానే పనిచేస్తుందని నీల్సన్ ధీమా వ్యక్తంచేస్తున్నారు.
''కరోనావైరస్ చాలా వరకూ మెర్స్, సార్స్ వంటి ఇతర వైరస్‌ల వంటిదే. ఆ వైరస్‌లను యూవీసీ కాంతి సంహరిస్తోందని మాకు తెలుసు'' అని ఆయన చెప్తున్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాలిక్యులార్ బయాలజీ నిపుణురాలు డాక్టర్ లీనా సిరిక్, కరోనావైరస్ మీద పోరాటానికి యూవీ డిసిన్ఫెక్షన్ రోబోలు సాయపడతాయని అంగీకరిస్తున్నారు.
''కరోనావైరస్‌ను సంహరించటం ఈ రోబోల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనలేం కానీ, వీటితో రక్షణ పెరుగుతుంది'' అని ఆమె పేర్కొన్నారు. ''హాస్పిటళ్లలో కరోనావైరస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్ నియంత్రణ కోణంలో చూసినపుడు ప్రక్షాళన విషయంలో అత్యంత సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం వివేకం అనిపించుకుంటుంది'' అని చెప్పారు.
అల్ట్రావయొలెట్ కాంతి పూర్తిస్థాయిలో ప్రభావం చూపటానికి అది నేరుగా ఉపరితలం మీద ప్రసరించాల్సి ఉంటుంది. ఒకవేళ ధూళి లేదా ఏదైనా అడ్డుగా ఉండి కాంతితరంగాలను అటకాయించినట్లయితే.. అటువంటి నీడ ప్రాంతాల్లో సూక్ష్మజీవుల ప్రక్షాళన జరగదు. కాబట్టి.. ఈ రోబోను రంగంలోకి దించే ముందు మనుషులు శుభ్రం చేయాల్సి ఉంటుంది.
నీరు, గాలిని శుభ్రం చేయటానికి యూవీ కాంతిని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రయోగశాలల్లోనూ దీని ఉపయోగం ఎంతో కాలంగా కొనసాగుతోంది. అయితే, యూవీ కాంతిని స్వయంచాలిత రోబోలతో అనుసంధానించటం ఇటీవలి పరిణామం. అమెరికా సంస్థ క్సెనెక్స్.. లైట్‌స్ట్రైక్ అనే యంత్రాన్ని తయారు చేసింది. దీనిని డిసిన్ఫెక్షన్ చేయదలచుకున్న చోట మనుషులు తీసుకెళ్లి పెట్టాల్సి ఉంటుంది. ఈ యంత్రం యు ఆకారంలోని బల్బు నుంచి తీవ్ర యూవీ కాంతిని ప్రసరిస్తుంది.
ఈ సంస్థకు ఇటలీ, జపాన్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియాల నుంచి డిమాండ్ పెరిగింది. హాస్పిటల్‌లో ఇన్‌ఫెక్షన్లను తగ్గించటానికి, సూపర్‌బగ్‌లుగా పిలిచే ప్రమాదకర సూక్ష్మజీవుల మీద పోరాడటానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చూపాయని క్సెనెక్స్ చెప్తోంది. 2014లో టెక్సాస్‌లోని ఒక హాస్పిటల్‌లో ఒక ఎబోలా కేసు చికిత్స అనంతరం అక్కడ ప్రక్షాళన కోసం ఈ యంత్రాన్ని ఉపయోగించారు.
ప్రస్తుతం 500కు పైగా ఆరోగ్య కేంద్రాలు ఈ యంత్రాన్ని వాడుతున్నాయి. అందులో ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయి. ప్రస్తుతం కాలిఫోర్నియా, నెబ్రాస్కా రాష్ట్రాల్లో కరోనావైరస్ రోగులకు చికిత్స అందించిన గదులను శుభ్రం చేయటానికి తమ యంత్రాన్ని వాడుతున్నారని ఈ సంస్థ తెలిపింది. ఇక కరోనావైరస్ పుట్టుకొచ్చిన చైనాలో.. ఈ వ్యాధి మీద పోరాడటానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
ఈ దేశం డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థల కోసం వ్యయం చేస్తున్న దేశాల్లో చైనా ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఐడీసీ నివేదిక చెప్తోంది. ప్రధానంగా డిసిన్ఫెక్షన్, మందులు, వైద్య పరికరాల సరఫరా, వ్యర్ధాల తొలగింపు, శరీర ఉష్ణోగ్రతల తనిఖీ వంటి అనేక పనుల కోసం రోబోలను ఉపయోగిస్తున్నట్లు ఐడీసీ చైనాలో సీనియర్ రీసెర్స్ మేనేజర్ లియాన్ గ్జియావో తెలిపారు.
''హాస్పిటళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల కోసం రోబోటిక్స్ మరింత ఎక్కువగా ఉపయోగపడటంలో ఇదొక విజయమని నేను భావిస్తున్నా'' అని ఆయన పేర్కొన్నారు. అయితే.. హాస్పిటళ్లలో రోబోలను మోహరించటానికి స్థలం కొరత, వీటిని సిబ్బంది అంగీకరించలేకపోవటం సవాళ్లుగా ఉన్నాయన్నారు. చైనాలో దేశీయ రోబోటిక్స్ కంపెనీలు వినూత్న ఆవిష్కరణల దిశగా పయనించటానికి కరోనావైరస్ తోడ్పడింది.
షెన్‌జెన్ కేంద్రంగా గల యువీబాట్ అనే సంస్థ ఇప్పటికే స్వయంచాలిత రోబోలను తయారు చేస్తోంది. తన సాంకేతిక పరిజ్ఞానాన్ని డిసిన్ఫెక్షన్ పరికరాన్ని తయారు చేయటానికి అనువుగా వేగంగా మలచుకుంది. ''చైనాలో అందరిలాగానే సాయం చేయటం కోసం మా వంతు కృషి చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం'' అని యువీబాట్ ప్రతినిధి కీమన్ గువాన్ పేర్కొన్నారు.
ఈ స్టార్టప్ సంస్థ.. తన రోబోటిక్ సాంకేతికత, సాఫ్ట్‌వేర్‌కు థర్మల్ కెమెరాలు, యూవీ-సీ కాంతిని ప్రసరించే బల్బులను అమర్చింది. ''మాకు సాంకేతిక పరిజ్ఞానమనేది మీరు అనుకున్నంత కష్టం కాదు. నిజానికి అదొక లెగో లాంటిది'' అని చెప్పారు గువాన్. ఉహాన్‌లో ఫ్యాక్టరీలకు, కార్యాలయాలకు, ఒక విమానాశ్రయానికి, ఒక హాస్పిటల్‌కు ఇది తన రోబోలను సరఫరా చేసింది. ''ఇప్పుడు లగేజ్ హాల్‌లో ఆ రోబో పనిచేస్తోంది. పగటిపూట శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేస్తోంది. రాత్రి పూట వైరస్‌ను సంహరించే పని చేస్తుంది'' అని ఆయన వివరించారు. అయితే ఈ రోబో ఎంత సమర్థంగా పనిచేస్తుందనేది ఇంకా అంచనా వేయలేదు.
ఇదిలావుంటే, కరోనావైరస్‌ను నియంత్రించటానికి ఫ్యాక్టరీల మూసివేత, ఇతర ఆంక్షల కారణంగా ఈ రోబోల తయారీకి అవసరమైన విడిభాగాలు అందటం లేదు. ''కేవలం ఒక్క భాగం లేకపోయినా, దీనిని తయారు చేయలేం'' అని గువాన్ చెప్పారు. అయితే.. గత రెండు వారాలుగా పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. ''మహమ్మారుల గురించి చెప్పటానికి మంచి విషయాలు లేవు కానీ.. పారిశ్రామిక రంగం కొత్త పరిష్కారాలు కనుగొనే పరిస్థితులను కరోనావైరస్ కల్పించింది'' అంటారు ప్రొఫెసర్ కోల్మస్.