రోజువారీ పనుల్లో కొట్టుకుపోతున్న నేటి మహిళలు మాయిశ్చరైజర్ వాడకాన్ని కూడా గబగబా కానిచ్చేస్తుంటారు. కాస్తంత మాయిశ్చరైజర్ చేతిలోకి తీసుకుని గబగబా ముఖమంతా పులిమేసి, తయారై ఆఫీసులకు పరుగులు పెడుతుంటారు. అయితే ఇలా కాకుండా ముఖంలోని నిస్తేజాన్ని మాయం చేసేలా మాయిశ్చరైజర్‌ని వాడవచ్చు. అదెలాగంటే..
ముందుగా... మాయిశ్చరైజర్‌గానీ, క్లెన్సర్‌ని గానీ రెండు చేతులతో చూపుడు వేలు, మధ్య వేళ్ల మీద తీసుకోవాలి. ముఖం మీద గుండ్రంగా తిప్పుతూ దాన్ని లోపలికి ఇంకిపోయేలా మర్దనా చేయాలి. చుబుకం మీదినుంచి చెవి వరకు, పై పెదవి నుంచి చెవి వరకు, ముక్కు నుంచి దవడ మీదికి వేళ్లతో సుతిమెత్తగా మర్దనా చేయాలి.
అలాగే.. కనుబొమలపైన మధ్య నుంచి మొదలుపెట్టి కణతల వరకు, నుదుటి మధ్యలోంచి రెండు వైపులకూ... వేళ్లను కదిలిస్తూ మర్దనా చేయాలి. ఇలా చేసిన తరువాత ముఖాన్ని చూస్తే... తేడా ఇట్టే తెలిసిపోతుంది. మెరిసిపోతూ కనిపిస్తున్న ముఖాన్ని చూడగానే ఎవరికైనా పెదవులపై చిరునవ్వు కనిపించక మానదు.
ఇందులో రహస్యం ఏమీ లేదుగానీ... వేళ్లతో మర్దిస్తూ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దానివల్ల ముఖంలోని నిస్తేజమంతా పరారైపోయి, ఉత్సాహం తొణికిసలాడుతూ కనిపిస్తుందంతే...!!