జీవిత కాలం ఉచితంగా మాట్లాడుకోండి.... బీఎస్‌ఎన్ఎల్ ఫ్రీ వాయిస్ కాల్స్ బంపర్ ఆఫర్... జనవరి నుంచి?

బుధవారం, 12 అక్టోబరు 2016 (18:55 IST)
విజ‌య‌వాడ ‌: జియో ఉచిత ఆఫ‌ర్‌కు బి.ఎస్.ఎన్.ఎల్. కూడా బేజార‌యింది. రిల‌యన్స్ దెబ్బకు సతమతం అవుతున్న టెలీకాం సంస్థలు అన్నీ ఉలిక్కిపడే ఆఫర్ ప్రకటించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమ‌వుతోంది. రిలయన్స్ జియో సైతం బెంబేలెత్తేలా ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫర్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ సమాయాత్తం అవుతోంది. తమ కస్టమర్లకు వచ్చే ఏడాది జనవరి నుంచి ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ అందించాలని నిర్ణయించింది. 
 
దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు, జీవిత కాలంపాటు ఈ ఆఫర్ అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ చెబుతోంది. అయితే దీనికి ఓ చిన్న కండీషన్ పెట్టింది. ఇంట్లో తమ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ ఉన్న మొబైల్ యూజర్లకే ఈ సదుపాయం వర్తిస్తుందని సంస్థ తెలిపింది. జియో కంటే రూ.2-4 తక్కువకే ఈ ప్లాన్‌ను అందించాలని భావిస్తోంది. 
 
వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.149 ప్లాన్‌ సహా అంతకంటే ఖరీదైన ప్లాన్లలో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ అందిస్తామని జియో తెలిపింది. జియో కేవలం 4జీ నెట్‌వర్క్‌పైనే పని చేస్తుంది. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ 3జీ, 2జీ నెట్‌వర్క్‌లపై కూడా పని చేస్తుంది. త్వరలోనే ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఆఫర్‌ను ప్రకటిస్తే.. మిగతా టెలీకాం సంస్థలైన ఎయిర్‌టెల్, ఐడియాలపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం.

వెబ్దునియా పై చదవండి