బలాబలాల పోటీలో గెలుపు పళనిదా.. పన్నీర్ సెల్వందా? శనివారమే తుదిపోరు
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (05:25 IST)
తమిళనాడు రాజకీయాల్లో తొలివిజయం శశికళ వర్గానికే అని తేల్చిచెబుతూ గవర్నర్ విద్యాసాగరరావు గురువారం సాయంత్రం చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాయి. గో్ల్డెన్ రిసార్టులో విడిది చేసిన ఎమ్మెల్యేలు పూర్తిగా పళనిస్వామికే బలపరీక్షలో విజయం కట్టబెడతారా లేదా మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలో అడుగుబెట్టి ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుంటారా అనే ప్రశ్న తడి ఆరకముందే రాజకీయాలు వేగంగా మారిపోయాయి. బలపరీక్షలో శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును తోసిపుచ్చి ఈ శనివారమే అంటే రేపటిదినమే శాసనసభలో మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పిన పళని ఎమ్మెల్యేలను తిరిగి గోల్డెన్ రిసార్టుకు తీసుకెళ్లారు. దీంతో ఎవరు విజేత్ అని తేలడానికి మరో 24 గంటలు వేచి చూడవలసి ఉంది.
తమిళనాడులోని ఉత్కంఠ భరిత రాజకీయాలకు శనివారం తెరపడనుంది. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం బలాబలాలు తేలేందుకు 18న అసెంబ్లీ సమావేశం వేదిక కానుంది. పళనికి గవర్నర్ విద్యాసాగర్‌రావు బల నిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈ సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మరికొందరిని ఆకట్టుకోవాలని పన్నీర్ ఎత్తుగడవేశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో పళని వేగంగా స్పందించారు. బలపరీక్షకు 15 రోజుల సమయం తీసుకోకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడోరోజునే అంటే శనివారం నాడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు 15 రోజులు చాలనే పన్నీర్ ఆశలపై నీళ్లు చల్లారు. ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌కు వచ్చిన ఎమ్మెల్యేలను ఎంతో జాగ్రత్తగా మరలా రిసార్టుకు చేర్చారు. రిసార్టులోని ఎమ్మెల్యేలను ఇక నేరుగా శనివారం నాటి అసెంబ్లీ సమావేశంలోనే హాజరుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఎనిమిది రోజుల గడువులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మాత్రమే తనవైపు తిప్పుకోగలిగిన పన్నీర్‌సెల్వం కేవలం రెండు రోజుల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడం ఎంత వరకు సాధ్యమనే అనుమానం నెలకొంది. శశికళ శిబిరంలో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలకు విముక్తి కల్పిస్తే తన వద్దకు రావడం ఖాయమని పన్నీర్ చెబుతున్నారు. తమకు 124 మంది ఎమ్మెల్యే స్పష్టమైన మద్దతు ఉన్నందునే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని మంత్రి జయకుమార్ అన్నారు. పైగా పన్నీర్‌సెల్వం మినహా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి స్వీకరించేందుకు సిద్ధమని శశికళ వర్గీయుడైన డిప్యూటీ స్పీకర్ తంబిదురై ప్రకటించడం ద్వారా 11మంది ఎమ్మెల్యేలకు ఎరవేశారు.
ప్రస్తుతం కువత్తూరు శిబిరంలో 124మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి బలపరీక్ష నుంచి సీఎం పళనిస్వామి గట్టెక్కడం ఖాయం. అయితే అమ్మ సెంటిమెంట్, ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్ వద్ద పరిశీలనలో ఉన్న ఫిర్యాదు తనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనబెడతాయని పన్నీర్ సెల్వం ఆశపడుతున్నారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకునే సమయం లేకపోవడంతో పళనిస్వామికి అనుకూలంగా ఓటుపడకుండా ప్రజలను ఉత్తేజితులను చేసేందుకు శుక్రవారం సిద్ధమయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళపై అనర్హత వేటువేయాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్‌ను కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించి శశికళపై అనర్హత వేటుపడిన పక్షంలో పార్టీ మళ్లీ మాజీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, పన్నీర్‌సెల్వం చేతుల్లోకి వస్తుంది. శశికళ ఎంపికపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించవచ్చు. ఈ రెండు కోణాలు బలపరీక్ష నుంచి గట్టెక్కించగలవని పన్నీర్ సెల్వం నమ్మకంతో ఉన్నారు.
చివరి ఘట్టం సీఎం పదవికి తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని ప్రకటించడం ద్వారా శశికళపై తిరుగుబావుటా ఎగురవేసిన పన్నీర్‌ను పార్టీ బహిష్కరించింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళను ప్రజలు హర్షించరని, ఎమ్మెల్యేలను బెదిరించి, మభ్యపెట్టి సీఎం అయ్యేందుకు ఆమె సిద్ధమయ్యారని పన్నీర్ చేసిన ఆరోపణలతో పార్టీ రెండుగా చీలిపోయింది.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడం పన్నీర్‌కు అనివార్యమైంది. అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 136 కాగా, జయ మరణంతో 135కి తగ్గింది. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో పన్నీర్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించగా క్రమేణా ఈ సంఖ్య 11కు పెరిగింది. అలాగే 12 మంది ఎంపీలు సైతం పన్నీర్ పక్షాన చేరారు. శశికళ తన వర్గంలోని ఎమ్మెల్యేలతో చెన్నైకి 93 కిలోమీటర్ల దూరంలోని గోల్డన్ బే రిసార్టులో శిబిరం నిర్వహించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను గవర్నర్ ఆహ్వానించడంలో జరుగుతున్న జాప్యం తనకు కలిసి వస్తుందని ఆశించిన పన్నీర్‌సెల్వంకు భంగపాటే మిగిలింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ జైలు కెళ్లినా ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు పయనించలేదు. శశికళ, ఎడపాడిల చేత కిడ్నాప్‌నకు గురైన ఎమ్మెల్యేకు విముక్తి ప్రసాదించేలా పోలీసుశాఖను ఆదేశించాలంటూ కువత్తూరు శిబిరం నుంచి పన్నీర్‌వైపునకు వచ్చిన ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదును హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలను రాబట్టుకునేందుకు పన్నీర్ చేసిన కిడ్నాప్ కేసు ప్రయత్నం ఫలించలేదు. దీంతో పన్నీర్‌కు మద్దతు పలికే ఎమ్మెల్యేల సంఖ్య 11తోనే ఆగిపోయింది.