సొంత పార్టీ పెట్టడమా, దేంట్లో అయినా కలిసిపోవడమా.. ఇదే రజనీ డైలమ్మా.. రావటం మాత్రం ఖాయమట

గురువారం, 18 మే 2017 (05:46 IST)
దాదాపు రెండు దశాబ్దాలపైగా తన రాజకీయ అవతారంపై  అబిమానులను ఊరిస్తూ వస్తున్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయమని తెలుస్తోంది. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల తలైవా ప్రకటించడంతో రాజకీయ వర్గాలు కూడా ఆయన అరంగేట్రంపై అంచనాలు వేస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో రజనీ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు పెరిగాయి. ఈనెల 19నే రజనీ కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
 
రజనీకాంత్‌ ఆసరాగా తమిళ ప్రాంతంలో ఎలాగైనా సరే..  పాగా వేయాలని చూసిన బీజేపీకి తీవ్ర నిరాశే ఎదురైంది. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సాక్షాత్తూ నరేంద్ర మోదీ.. రజనీ ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. ఆ సమయంలో రజనీకి బీజేపీ సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశ చూపింది. అయినా తలైవా చలించలేదు.  రాజకీయాలకు తను దూరమని తన అభిమానులు కూడా రాజకీయాలు చేయవద్దని రజనీ పదే పదే చెబుతూ వచ్చారు. 
 
ఎన్నడూ లేనిది ఈసారి అభిమానులతో సమావేశంలో రజనీ వ్యవహరిస్తున్న తీరు చాలా కొత్తగా ఉందని అభిమానులే పేర్కొంటున్నారు. రజనీ తాజా ప్రకటనలు పరిశీలించినా తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని చెబుతున్నారు. అయితే రజనీ రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తమిళనాడు శాఖలు కోరుతున్నాయి. అయితే సొంతపార్టీ పెట్టాలని అభిమానులు రజనీకాంత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అసలు రాజకీయాల్లోకి రావడంపైనే సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బుధవారం భేటీలో రజనీ తన అభిమానులకు హామీ ఇచ్చారు కూడా. 
 
అయితే గతంలో అనేకసార్లు రజనీ రాజకీయ రంగప్రవేశం అంటూ చేసిన హైప్ అంతా తాను రాజకీయాల్లోకి రావటం లేదంటూ రజనీ చేసే ఒక్క ప్రకటనతో తుస్సుమనిపించేది. ఇప్పుడూ అలాగే అవుతుందా లేదా రజనీ బోల్డ్ నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది త్వరలోనే తేలిపోవచ్చు అంటున్నారు.
 

వెబ్దునియా పై చదవండి