దేశంలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా కేసులు : మళ్లీ లాక్డౌన్ తప్పదా?
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:06 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా, గత సంవత్సరం నవంబరు తర్వాత, యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తొలిసారిగా భారీగా పెరగడంతో పాటు, 17 రోజుల తర్వాత మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది.
గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా, 4,421 కేసులు వచ్చాయి. నవంబరు నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి.
ఆపై తిరిగి నిన్న ఆ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది.
ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి.
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
కొత్త కేసుల్లో న్యూ స్ట్రెయిన్ అధికంగా కనిపిస్తుండటంతో, దాని వ్యాప్తి గొలుసును విడగొట్టేందుకు వైద్యాధికారులు, స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.