తమిళనాడు రికార్డు : లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

శుక్రవారం, 3 జులై 2020 (19:05 IST)
కరోనా వైరస్ కేసుల్లో తమిళనాడు రాష్ట్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. శుక్రవారానికి ఈ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 4,329 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష మార్కును దాటి 1,02,721కి చేరింది. 
 
ఒక్క చెన్నై నగరంలోనే 2082 కేసులు నమోదయ్యాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఆ రాష్ట్రంలో ప్ర‌తిరోజు పెద్ద సంఖ్య‌లోనే న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం కూడా 64 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,385కు చేరింది. తమిళ‌నాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 
 
ఇదిలావుండగా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు శుక్ర‌వారం వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఎంపీ ఛ‌ట‌ర్జీ ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. గ‌త వారం రోజుల నుంచి త‌న‌కు స్వ‌ల్ప జ్వ‌రం ఉండ‌టంతో సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని చెప్పారు. 
 
జూన్ 19న నిర్వ‌హించిన ఆర్మీ జ‌వాను రాజేష్ ఓరాంగ్ అంత్య‌క్రియ‌ల్లో ఎంపీ ఛ‌ట‌ర్జీతో పాటు ఎంపీ సుమిత్రా ఖాన్ పాల్గొన్నారు. ఈ అంత్య‌క్రియ‌లకు వంద‌లాది మంది హాజ‌ర‌య్యారు. దీంతో అనేక మందిని క్వారంటైన్ చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు