బెంగుళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ.... సీఎం కేసీఆర్ కీలక స్టేట్మెంట్

శనివారం, 14 మార్చి 2020 (13:20 IST)
బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆ తర్వాత ఆయన భార్యకూ ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఇన్ఫోసిస్‌కు చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు. 
 
ముంద‌స్తు చ‌ర్య‌గా ఐఐపీఎం బిల్డింగ్‌లో ఉన్న‌వారిని త‌ర‌లిస్తున్న‌ట్లు ఇన్ఫోసిస్ సంస్థ వెల్ల‌డించింది. క‌ర్నాట‌క‌లోని బెంగుళూరులో ఇన్ఫోసిస్‌కు భారీ క్యాంప‌స్ ఉన్న‌ది. అక్క‌డ డ‌జ‌న్ల సంఖ్య‌లో బిల్డింగ్‌లు ఉన్నాయి. డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు, కార్పొరేట్ హౌజ్‌లు ఉన్నాయి. అయితే ఉద్యోగుల భ‌ద్ర‌తా దృష్ట్యా.. బిల్డింగ్‌ను శానిటైజ్ చేస్తున్న‌ట్లు డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ హెడ్ గురురాజ్ దేశ్‌పాండే తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా వ‌చ్చే దుష్ ప్ర‌చారాల‌కు దూరంగా ఉండాల‌న్నారు. 
 
మరోవైపు, కరోనా వైరస్‌ వ్యాపించకుండా తాము తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఈ వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 
 
కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
 
దేశంలో ఇప్పటివరకు 80మందికి కరోనా వైరస్‌ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ గుర్తుచేశారు. 
 
గాంధీ ఆస్పత్రిలో చేరిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వారి నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్‌ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు