ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... 'అప్పుడు నాకు 12 ఏళ్లు. ముంబై అండర్ 15 జట్టుకి ఎంపికయ్యా. దీంతో నా ఆనందానికి అవధులు లేవు. పుణెలో మూడు మ్యాచ్లు ఆడేందుకు టీంతోపాటు వెళ్లా. ఇంటి నుంచి కొంత డబ్బు తీసుకెళ్లా. అయితే పుణెలో జరిగిన మ్యాచ్లో నేను పేలవ ప్రదర్శన చేశా. నాలుగు పరుగులకే రనౌట్ అయ్యాను. తర్వాత డ్రస్సింగ్ రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా. నాకు మళ్లీ ఇంకో అవకాశం ఇక రాదనుకున్నా. తర్వాత అక్కడ వర్షం ప్రారంభమైంది. మ్యాచ్లు ఆడేందుకు లేదు. రోజంతా ఖాళీగా గడపాల్సి వచ్చింది.
ఇక చేసేదేమీ లేక అంతా కలసి సినిమాకు వెళ్లాం. బాగా తిన్నాం. అక్కడ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. రైలెక్కి ముంబై రైల్వే స్టేషన్లో దిగేసరికి జేబులో చిల్లి గవ్వ లేదు. పైగా చేతిలో రెండు బరువైన బ్యాగులు. ట్యాక్సీని పిలిచేందుకూ నా దగ్గర డబ్బులు లేవు. దాదర్ స్టేషన్ నుంచి శివాజీ పార్కు వరకూ నడవాల్సి వచ్చింది. అప్పుడు నా దగ్గర సెల్ఫోన్ ఉండుంటే.. ఒక్క ఎస్ఎంఎస్ ఇస్తే అమ్మానాన్నలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఉండేవారు, నేను క్యాబ్ తీసుకుని ఇంటికెళ్లిపోయేవాడిని కదా' అంటూ తన చిన్నప్పటి జ్ఞాపకాల్ని సచిన్ పంచుకున్నారు. తొందరలోనే ఆయన జీవితం ఆధారంగా 'సచిన్' చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే.