విరాట్ కోహ్లీ నీ పేరు మెరుపుగా మార్చుకో : వీరేంద్ర సెహ్వాగ్ సలహా

శుక్రవారం, 16 డిశెంబరు 2016 (16:02 IST)
అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరేంద్ర సెహ్వాగ్ ఓ సలహా ఇచ్చాడు. ఈ యేడాది అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించాడు. కోహ్లీ ఏ పేరు పెట్టుకోవాలో కూడా సెహ్వాగే సూచన చేయడం గమనార్హం. 
 
ఇదే అంశంపై సెహ్వాగ్ ఓ ట్వీట్ చేశాడు. ఈ యేడాది అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ సగటు 90 శాతంగా ఉంది. మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాలందిస్తున్నాడు. అందుకే తన పేరును 'మెరుపు'గా మార్చుకోమని సలహా ఇస్తున్నా. ‘ఈ ఏడాది విరాట్‌ ప్రదర్శన అద్భుతం. విరాట్‌ మెరుపులాంటివాడు. అందుకే కోహ్లీ తన పేరును మెరుపుగా మార్చుకోవాలి’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
కాగా, వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ట్విట్టర్‌ వేదికగా బౌండరీలు కొడుతున్నాడు. పదునైన, ఆలోచనాత్మక ట్వీట్లతో ఆకట్టుకుంటున్నాడు. భారత జట్టును, ఆటగాళ్లను ఎవరైనా విమర్శిస్తే దీటుగా కౌంటర్‌ ఇస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని ఉద్దేశించి సెహ్వాగ్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. 

వెబ్దునియా పై చదవండి