విద్యార్థినిపై రేప్ పుకార్లు.. కాల్పులు.. వీడియో తీసిన నయీమ్ భట్ మృతి ఎలా?

శనివారం, 16 ఏప్రియల్ 2016 (12:24 IST)
జమ్మూ కాశ్మీర్ హంద్వారాలో జరిగిన కాల్పుల్లో ఆ రాష్ట్రానికి చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నయీమ్ భట్ మృతిచెందాడు. ఓ పాఠశాల విద్యార్ధినిపై ఓ సైనికుడు అత్యాచారం చేశాడనే పుకార్లు రావడంతో స్థానిక యువకులు ఆర్మీ పోస్ట్‌పైకి రాళ్లు రువ్వారు. తనపై ఎవ్వరూ అత్యాచారం చేయలేదని చెప్పడానికి స్వయంగా ఆ బాలిక మీడియా ముందుకు వచ్చి పుకార్లకు అడ్డుకట్ట వేసేలోగానే ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి. 
 
ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు, సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న నయీమ్ భట్ ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో బంధించేందుకు యత్నించాడు. అయితే కాల్పుల్లో పొరపాటున బుల్లెట్లు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నయీమ్ భట్ కూడా ఉండటం గమనార్హం.
 
ఇకపోతే.. నయీమ్ కాశ్మీర్ జింఖాన్ క్లబ్ తరపున టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. ఇప్పటికే పలు ట్రోఫీల్లో మ్యాన్ ఆఫ్ ద సీరీస్‌గా నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా ఇప్పటికే అందుకున్నాడు. ఐదేళ్లుగా తమ క్లబ్ తరపున ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్న నయీమ్ మృతిపట్ల యావత్తు క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి