హ్యూస్ విషాదం: వారానికి తర్వాత బంతి పట్టిన అబాట్!

బుధవారం, 3 డిశెంబరు 2014 (15:36 IST)
ఫిలిప్ హ్యూస్ విషాదం జరిగిన వారం రోజుల తర్వాత అబాట్ మళ్లీ బంతి పట్టి బౌలింగ్‌కు దిగాడు. అబాట్‌ వేసిన బౌన్సర్‌ తలపై తగలడంతో హ్యూస్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. 
 
తీవ్రంగా కుమిలిపోయిన అబాట్‌ ఈ విషాదాంతం నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన న్యూ సౌత్‌వేల్స్‌ నెట్‌ ప్రాక్టీస్‌లో అబాట్‌ బౌలింగ్‌ చేసినట్లు కొరియర్‌ మెయిల్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. అబాట్‌ తిరిగి రావడం శుభపరిణామని చెప్పింది. అనూహ్య ఘటనపై క్రికెట్‌ ప్రపంచం అబాట్‌కు బాసటగా నిలిచింది. 
 
22 ఏళ్ల అబాట్ మంగళవారం సిడ్నీ క్రికెట్ మైదానం నెట్స్‌లో సాధన చేశాడు. అబాట్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అతను ఒంటరిగా ఉండకుండా క్రికెట్ ఆస్ట్రేలియా జాగ్రత్త తీసుకుంది. ఆసీస్ పేసర్ బొలింజర్‌తో పాటు హ్యూస్ సోదరి మెగన్, కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆబాట్‌కు తోడుగా ఉన్నారు. అబాట్ రెండు నెలల క్రితమే ఆస్ట్రేలియా తరఫున వన్డే, టీ20ల్లో ఆరంగేట్రం చేశాడు. 
 
మరోవైపు హ్యూస్‌కు నివాళిగా మాస్టర్ సచిన్ ప్రత్యేక ఫోటో పోస్ట్ చేసి.. హ్యూస్‌కు నివాళులు అర్పించాడు. ఈ మేరకు ఫిల్ నిన్ను మిస్సవుతున్నాం అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

వెబ్దునియా పై చదవండి