శ్రీలంకపై టెస్ట్ సిరీస్ నెగ్గిన దక్షిణాఫ్రికా.. నంబర్ 1 ర్యాంకు సొంతం!

మంగళవారం, 29 జులై 2014 (10:07 IST)
శ్రీలంక గడ్డపై ఆతిథ్య లంకేయులతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 1-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో జట్టుకు తొలిసారి నాయకత్వం వహించిన హషీమ్ ఆమ్లా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శ్రీలంకతో సోమవారం ముగిసిన రెండో టెస్టును దక్షిణాఫ్రికా డ్రా గా ముగించింది. ఫలితంగా దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-0 తో సొంతం చేసుకుంది. 
 
శ్రీలంక గడ్డపై 21 ఏళ్లగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయాన్ని హషీయా ఆమ్లా కెప్టెన్‌గా మొదటి ప్రయత్నంలోనే అందించాడు. రెండో మ్యాచ్‌లో ఓటమి ఖాయమనుకున్న దక్షిణాఫ్రికా అసామాన పోరాటంతో మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. 369 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు ఓ దశలో 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. 
 
అయితే... టెయిలెండర్లు ఫిలాండర్, ఇమ్రాన్ తాహిర్‌లు చివరి తొమ్మిది ఓవర్లు శ్రీలంక బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని వారి విజయానికి అడ్డుపడ్డారు. ఈ సిరీస్ విజయంతో దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి