పరిపక్వత లేని కోహ్లీ జట్టుకే ప్రమాదం.. మళ్లీ ధోనినే కెప్టెన్ చేయండి.. అన్నీ సర్దుకుంటాయి.. మండిపడుతున్న నెటిజన్లు

శుక్రవారం, 23 జూన్ 2017 (05:28 IST)
నా పనితీరుపై టీమిండియా కెప్టెన్‌కు కొన్ని రిజర్వేషన్లు ఉన్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలో కోచ్‌గా నా బాధ్యతలను సీఏసీలో కానీ, బీసీసీఐలో కాని అర్హులైన వారికి ఇవ్వడమే ఉత్తమమని నమ్ముతున్నాను అంటూ అనిల్ కుంబ్లే ప్రకటించిన ఏక వాక్య ప్రకటన ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒక్క ఏక వాక్య ప్రకటన 130 కోట్ల మంది భారతీయుల ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెద్ద విలన్‌ని చేసిపడేసింది. కోచ్‌ అనిల్‌ కుంబ్లే వివాదాస్పద రీతిలో పదవి నుంచి తప్పుకోవడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 
 
టీమిండియాలో సూపర్‌ స్టార్‌ కల్చర్‌ నడుస్తోందని.. కోచ్‌ విషయంలో విరాట్‌కు వీటో అధికారం ఇచ్చారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. జట్టును తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉన్న భారత గురువు పాత్ర కెప్టెన్‌, స్టార్‌ ఆటగాళ్ల చేతిలో కీలుబొమ్మ అయిపోయిందని దుమ్మెత్తి పోస్తున్నారు. పదవిలో ఉండాలంటే వారికి గులాం అనాల్సిందే అనే విషయం కుంబ్లే నిష్క్రమణతో రుజువైందని మాజీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత దిగ్గజం అనిల్‌ను సాగనంపిన కోహ్లీకి కళ్లెం వేయాల్సిందేనంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో నెటిజన్లు మరో అడుగు ముందుకేశారు. ఇన్నాళ్లు టీమిండియా సూపర్‌ హీరోగా విరాట్‌ను ఆకాశానికెత్తిన వారు ఇప్పుడు అతణ్ణి కెప్టెన్‌గా తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అతని స్థానంలో మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి మళ్లీ పగ్గాలు అప్పగించాలంటున్నారు. ఇప్పటికే.. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌ చేతిలో ఓటమితో కోహ్లీపై తీవ్ర విమర్శనాస్ర్తాలు సంధించిన ఫ్యాన్స్‌ కుంబ్లే రాజీనామాతో కెప్టెన్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ అయిన ధోనీ పగ్గాలు అందుకుంటేనే భారత జట్టు వాతావరణం చల్లబడుతుందని అంటున్నారు. కుంబ్లే వర్సెస్‌ కోహ్లీ అనే ట్యాగ్‌లైన్‌తో ఫ్యాన్స్‌ కురిపిసున్న ట్వీట్ల వర్షం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీట్‌ పుట్టిస్తున్నాయి. 
 
ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో మహీ సిద్ధహస్తుడని అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్‌గా కోహ్లీ కంటే ధోనీ వంద రెట్లు ఉత్తముడని, విరాట్‌ మాత్రం మహీ కంటే వంద రెట్లు కోపిష్టి అని కాన్షు అనే అభిమాని ట్వీట్‌ చేశాడు. ‘ధోనీని కెప్టెన్‌ చేయం డి అన్నీ సర్థుకుంటాయ’ని అనిల్‌ శ్రీవాస్తవ రాశాడు. ‘కోహ్లీపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలి. సారథిగా అతనిలో పరిపక్వత లేదు. ధోనీని కెప్టెన్‌ చేయండ’ని అమిత్‌ రావెల్‌ ట్వీట్‌ చేశాడు. ‘టీమిండియాకు ధోనీని కెప్టెన్‌ చేయాల్సిందే. ఎందుకంటే.. అతనో దిగ్గజం. అతను విరాట్‌లా వ్యవహరించడ’ని హరీష్‌ అనే అభిమాని పేర్కొన్నాడు. ఇక, ‘కోహ్లీ తలతిక్క కెప్టెన్‌. అతణ్ణి రాజీనామా చేయాలని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేకుండానే ధోనీని మళ్లీ సారథి చేయాల’ని విపుల్‌ శర్మ డిమాండ్‌ చేశాడు.
 
ప్రధానంగా కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ ఒక సెక్షన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం భారత్ క్రికెట్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి ముగింపు పలకాలంటే తిరిగి ధోనిని జాతీయ జట్టుకు కెప్టెన్ గా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆన్ ఫీల్డ్ లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లో సైతం హుందాగా ఉండే ధోనినే సారథిగా కరెక్ట్ అంటూ పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
 
విరాట్‌ నాణ్యమైన ఆటగాడే. కానీ... ధోనీ లాంటి దిగ్గజ కెప్టెన్‌ కాద’ని శుభమ్‌ చంద్ర ట్వీట్‌ చేశాడు. ఇక, పనిలో పనిగా సెహ్వాగ్‌ను కొత్త కోచ్‌గా నియమించి మహీని కెప్టెన్‌గా ప్రకటించాలని కౌశిక్‌ అనే అభిమాని పేర్కొన్నాడు. కాగా, 2014లోనే టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనీ.. ఈ ఏడాది జనవరిలో వన్డే సారథ్యం నుంచి తప్పుకున్నాడు. మహీ కెప్టెన్సీలో భారత్‌ మూడు ఐసీసీ ట్రోఫీలు.. (వరల్డ్‌కప్‌, వరల్డ్‌ టీ-20, చాంపియన్స్‌ ట్రోఫీ) సాధించింది.
 

వెబ్దునియా పై చదవండి