శత్రుదేశం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోతోంది. ఆ దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. అలాగే, నిత్యావసర ధరలు మిన్నంటుతున్నాయి. దీంతో ఆ దేశం ఆర్థికంగా నానాటికీ దిగజారిపోతోంది. కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉండేది. కానీ ఆ దేశ పాలకులు అభివృద్ధిపై దృష్టిసారించకపోవడం, ఉగ్రవాదులను పెంచి పోషించడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలపై పాకిస్థాన్ సైన్యం ఆధిపత్యం చెలాయించడం, తమ మాట వినకుంటే సైనిక తిరుగుబాటుతో దేశాన్ని తమ గుప్పెట్లో తెచ్చుకోవడం వంటి పరిణామాల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.
ఈ క్రమంలో తాజాగా వెలువడిన జీడీపీ గణాంకాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మన దేశంలోని తమిళనాడు రాష్ట్రం కంటే తక్కువ కావడం గమనార్హం. ఇది ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అంతేకాకుండా తమిళనాడులో సగటు వ్యక్తి సంపాదన, పాకిస్థాన్‌లోని సగటు వ్యక్తి సంపాదన కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. 1995 నాటి గణాంకాలను పరిశీలిస్తే, తమిళనాడు జీడీపీ 15.7 బిలియన్ డాలర్లు ఉండగా, పాకిస్థాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే 2025 నాటికి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ప్రస్తుత అంచనాల ప్రకారం తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా, పాకిస్థాన్ జీడీపీ మాత్రం 397.5 బిలియన్ డాలర్లకే పరిమితం కావడం గమనార్హం.
ఈ పరిణామాలపై నౌక్రీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్ చందానీ స్పందిస్తూ, పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం ఇకపైనా ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ వివాదాన్ని పక్కనబెట్టి ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి కీలక రంగాలపై దృష్టిసారించాలి. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం మానుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని హితవు పలికారు.