ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్ జట్టు సభ్యులకు ఓ సలహా ఇచ్చారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో శక్తినంతా ధారపోసి, విజయం సాధించి హీరోలుగా మిగిలిపోవాలని పిలుపునిచ్చారు.
ఇంగ్లండ్ వేదికగా గత నెల 30వ తేదీన ప్రారంభమైన ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మాంచస్టర్ వేదికగా ఈ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్ తమకు ఎంతో ఆసక్తిగా ఉందని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ చెప్పాడు.
దీనిపై ఆయన స్పందిస్తూ, భారత్‌ను ఈసారి ఓడించి.. తమ క్రికెటర్లు హీరో అవ్వాలని పిలుపునిచ్చారు. "మ్యాచ్‌లో జరిగే ఘటనలే మీ కెరీర్‌లో కీలకమవుతుంది. మీరు మ్యాచ్‌లో అదరగొడితే.. మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు" అంటూ ఆటగాళ్లతో చెప్పినట్టు వెల్లడించాడు.
"సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. ఫలితంగా ఇరు జట్ల ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ, మా జట్టు ఆటగాళ్లు మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతారు. మాకు అందిన అవకాశాలను వినియోగించుకొని విజయం సాధిస్తాం" అని ఆర్థర్ వెల్లడించారు.