తెలంగాణాలో "ఎవరి గోల వారిది".. చివరికి ఏ దెసకో..?!!
FILE
రాష్ట్రం ఎటు పోతోంది. అభివృద్ధి వైపా...? అంధకారం లోనికా...? ఒకప్పుడు భారతదేశంలోని అన్ని అగ్ర రాష్ట్రాలకు పోటీదారుగా నిలబడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నేడు ఎక్కడ ఉందీ..? ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నాయకులు పరస్పరం విద్వేషాగ్ని రగిల్చుతున్నారు. ప్రాంతీయవాదం అనే ఆయుధాన్ని ఎవరికివారు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు.
ఒక పార్టీ అని లేదు.. ఒక నాయకుడని కాదు. ఎవరి గోల వారిదే. రైతన్నలు ఎరువులు కరవై లబోదిబోమంటున్నా.. వరదలు గ్రామాలకు గ్రామాలను దిగ్బంధిస్తున్నా ఎవరికీ ఏమీ పట్టడం లేదు. అంతటా ప్రాంతీయవాదమే. అది తెలంగాణావాదం కావచ్చు.. సమైక్య నినాదం కావచ్చు.
మొత్తమ్మీద ఇపుడు ప్రతి పార్టీకీ.. ప్రతి నాయకుడికీ తెలంగాణా సెంటర్ ఫర్ ది అట్రాక్షన్. ఈ నినాదాన్ని తమకు అనుకూలంగా మలచుకుని భవిష్య వ్యూహాన్ని రచించే పనిలో పడుతున్నారే తప్ప సగటు జీవి జీవితం ఎలా ఉందని మాట్లాడేవారే కరవవుతున్నారు. ఒకవేళ మాట్లాడే "నారాయణ"లున్నా వారి మాటలను పట్టించుకునే వారేరీ..?
ఒకాయన డిసెంబరు తర్వాత ఆంధ్రకు భూకంపం రాకపోయినా కృత్రిమ భూకంపాన్ని సృష్టిస్తానంటుంటే మరొక నాయకుడు తమ పార్టీ సరసన మెల్లగా "జై తెలంగాణా" నినాదాన్ని చేర్చేసి తెలంగాణాకు జై అనేశారు. మరి సమైక్యాంధ్రకు ఆయన ఏం సమాధానం చెపుతారన్నది తర్వాతి ప్రశ్న. ఇదిలావుంటే మరో నాయకుడు ఆత్మరక్షణార్థం సీమసైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మొత్తమ్మీద డిసెంబరు తర్వాత తెలంగాణాలోనే కాదు.. యావదాంధ్రప్రదేశ్‌లోనూ పెనుభూకంపం రావడం స్పష్టమని తెలుస్తోంది. ఈ ఉపద్రవం ఆంధ్ర + సీమ + తెలంగాణా ప్రజలను ఏం చేస్తుందో.. ఏ తీరానికి చేరుస్తుందో... కాలమే నిర్ణయించాలి.