జయలలితకు Z+.. కరుణానిధికి Z.. పన్నీర్ సెల్వంకు Y.. పళనిస్వామికి? రసవత్తరంగా తమిళ పాలిటిక్స్...

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (16:54 IST)
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలతో పాటు... రాష్ట్ర పరిస్థితులు కూడా అస్తవ్యస్థంగా మారాయి. ఇదే అదునుగా భావించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అధికార అన్నాడీఎంకేలోని అంతర్గత కుమ్ములాటలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదిపింది. ఇందులోభాగంగా, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వాన్ని దగ్గరకు చేరదీసింది. ఆయన ద్వారా అధికార అన్నాడీఎంకే పాటు రాష్ట్ర సర్కారుకు ముచ్చెమటలు పోయిస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే వైరి వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. మరోవైపు శశికళ వర్గాన్ని ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి పూర్తిగా దూరం చేసేలా పాత కేసులను తిరగదోడి వాటితో ఉచ్చుబిగిస్తోంది. 
 
ఇదిలావుండగా, ముఖ్యమంత్రిగా ఉన్నా విపక్ష నేతగా ఉన్నా జయలలితకు 'జడ్ ప్లస్' భద్రత కొనసాగింది. అలాగే, డీఎంకే అధినేత కరుణానిధికి కూడా గత యూపీఏ ప్రభుత్వ సమయంలో 'జడ్' కేటగిరీ భద్రతను కల్పించారు. ఈ తరహా భద్రతను కలిగిన రాజకీయ నేతలు ఇప్పటివరకు వీరిద్దరే. కానీ, ఎవరూ ఊహించని విధంగా మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి 'వై' కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. మూడు షిప్టుల్లో నలుగురు చొప్పున ఆయనకు భద్రత కల్పిస్తారు. అదేసమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎడప్పాడి కె పళనిస్వామికి మాత్రం రాష్ట్ర సెక్యూరిటీ విభాగమే భద్రత కల్పిస్తోంది. దీనిపైనే సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
పిల్లికి కూడా హాని చేయని మాజీ సీఎం పన్నీరు సెల్వానికి 'వై' కేటగిరీ భద్రత కల్పించడం వెనుకు ఓ కారణం లేకపోలేదు. ఒకవేళ ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ను అరెస్టు చేస్తే పన్నీర్ సెల్వంపై దాడులు జరగవచ్చనే ముందుస్తు జాగ్రత్తతోనే ఈ తరహా భద్రతను కల్పించినట్టు తెలుస్తోంది. మొత్తంమీద అధికార అన్నాడీఎంకేను బీజేపీ ఓ ఆట ఆడుకుంటుందనే విమర్శలు లేకపోలేదు. 

వెబ్దునియా పై చదవండి