బాబాయ్‌కి ప్రేమతో.. ఒక్క పదవి కోసం రూ.కోట్లు...!

శుక్రవారం, 10 మార్చి 2017 (13:05 IST)
'నాన్నకు ప్రేమతో' సినిమా చూశాం కానీ.. ఈ బాబాయ్‌కి ప్రేమతో ఏంటని అనుకుంటున్నారా.. అవునండి.. ప్రస్తుతం జగన్, వై.ఎస్.వివేకానంద రెడ్డిల మధ్య ఈ ప్రేమ బంధాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబాయ్‌ని గెలిపించేందుకు జగన్‌బాబు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకటి రెండు కాదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం ప్రారంభించాడు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టడం ఇదే మొదటిదంటున్నారు కడపజిల్లా ప్రజలు.
 
వై.ఎస్.వివేకానందరెడ్డి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి సొంత తమ్ముడు. వై.ఎస్.కుటుంబం ఎటువైపు ఉంటే ఆ వైపు వెళ్ళడం, వారు చెప్పినట్లు వినడం వివేకానందరెడ్డికి ముందు నుంచి అలవాటు. మృదు స్వభావుడిగా తన పని తాను చేసుకునే వ్యక్తిగా వివేకానందరెడ్డికి మంచి మార్కులే కడపజిల్లాలో ఉన్నాయి. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు వివేకానందరెడ్డి. కానీ ఈ పదవిని దక్కించుకునేందుకు అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో తమ అభ్యర్థి బిటెక్ రవిని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని తితిదే నేతలు ప్రయత్నిస్తున్నారు.
 
అందుకే ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి తితిదే అభ్యర్థి తరపున ప్రచారం కూడా నిర్వహించేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాను గంటా వ్యక్తంచేశారు. దీంతో జగన్‌కు చిర్రెత్తుకొచ్చింది. మొత్తం కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 841 ఓట్లు ఉండగా అందులో ఎక్కువ అనుకూలంగా ఉన్నది వైకాపాకు మాత్రమే. కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు జగన్ వ్యూహాలు మీద వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. 
 
ఒకటి రెండు కాదు ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం ప్రారంభించాడట. ఇప్పటికే 70 శాతంకుపైగా అందులో ఖర్చు కూడా చేసేశారని తెలుస్తోంది. ఇక మిగిలింది ఎన్నికల ముందు ఖర్చుపెట్టి బాబాయ్ ని గెలిపించుకోవాలని కసితో ఉన్నారట. బాబాయ్ కోసం అబ్బాయి పడుతున్న తాపత్రయం చూసి కడపజిల్లా ప్రజలు ఆశ్చర్యపోతున్నారట. 

వెబ్దునియా పై చదవండి