జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కమలనాథులు షాక్ ఇస్తూ.. ఏపీ ప్రత్యేక హోదాపై నీళ్లు చల్లారు. ప్రధానితో కేంద్ర మంత్రులు జరిపిన సమావేశంలో ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గుచూపినట్టు సమాచారం. ఈ మేరకు ప్రధాని మోడీని బీజేపీ చీఫ్ అమిత్ షా ఒప్పించినట్టు వినికిడి. కేంద్ర నిర్ణయాన్ని చంద్రబాబుకు అమిత్ షాకు వివరించినట్టు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై బాబును ఒప్పించేందుకు వెంకయ్యనాయుడు గురువారం భేటీ కానున్నారు.
మరోవైపు కీలక సమావేశం అనంతరం ఏపీలో బీజేపీ వ్యవహారాలు చూస్తున్న ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలతో ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరేంటో తేటతెల్లమైంది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని, 14వ ఆర్థిక సంఘం తేల్చిందని తెలిపారు. అయితే ఈ నిర్ణయంతో ఏపీ ప్రజలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, హోదాకు సమానమైన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుందని ఆయన చెప్పారు.
కేంద్ర నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందించనున్నారు. తిరుపతి వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో తొలి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈలోగానే కేంద్రం ఓ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే.. పవన్‌కు షాక్ ఇస్తూ.. ఏపీ హోదాపై నీళ్లు చల్లేలా ఈ స్పష్టత ఉండనుంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సివుంటుంది.