తెల్ల చీరలో.. మల్లెపూలతో నువ్వు భలే ఉంటావే... రక్షణ కోరిన మహిళకు ఖాకీ వేధింపులు!

మంగళవారం, 22 మార్చి 2016 (08:23 IST)
తాగుబోతు భర్త వేధింపులను భరించలేక పోతున్నానని, అతని నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఠాణాను ఆశ్రయించిన ఓ మహిళకు పోలీసుల నుంచే కొత్త వేంధింపులు మొదలయ్యాయి. తెల్ల చీరలో.. మల్లెపూలతో నువ్వు భలే ఉంటావే అంటూ ఆ ఠాణాలో పని చేసే ఓ హోంగార్డ్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ మహిళ స్థానికులను ఆశ్రయించగా, వారంతా కలిసి ఖాకీకి తగిన గుణపాఠం నేర్పారు. 
 
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌, దీనదయాళ్‌నగర్‌కు చెందిన వేముల సరస్వతి అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది. భర్త పచ్చి తాగుబోతు. దీంతో ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్త పెడుతున్న బాధలు భరించలేకపోయేది. ఒక రాత్రి మద్యం ఎక్కువై భర్త కోట్లాటకు దిగటంతో దిక్కు తోచక ఫిలింనగర్‌ ఔట్‌పోస్టుకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. 
 
అక్కడ ఉన్న హోంగార్డు సురేష్‌ ఇంటికి వచ్చి సర్దిచెప్పాడు. తనేంటో నిరూపించుకునేందుకు ఆమె భర్తపై చేయి కూడా చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆమె పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్టయింది. భర్త నుంచి ఉపశమనం లభించిందనుకున్న సరస్వతికి హోంగార్డు నుంచి వేధింపులు 
ఆరంభమయ్యాయి. 
 
లిఖితపూర్వంగా ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న నెంబరు ద్వారా ఆమెకు ఫోన్‌ చేసేవాడు. నీకు మేలు చేసిన నాకేమిస్తావ్‌ అని వేధించటం మొదలుపెట్టాడు. నాలుగైదు రోజులుగా ఇంటికి కూడా వచ్చి ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. ఇక భరించలేక... ఆమె హోంగార్డు మాటలను రికార్డు చేసి విషయం బంధువులకు చెప్పింది. సోమవారం సాయంత్రం మరలా ఆమె ఇంటికి వచ్చిన హోంగార్డు సురేష్‌‌ను స్థానికులూ, బంధువులూ చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. బాధితురాలు ఫిలింనగర్‌ ఔట్‌పోస్టులో సురేష్‌‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి