చీపురుతో శివాలెత్తిన కేజ్రీవాల్... కమలం, హస్తం చూరుబట్టుకుని...

బుధవారం, 11 జూన్ 2014 (12:20 IST)
భారత రాజకీయాలు ఎప్పుడూ సర్దుబాటుతోనో.. దౌత్యంతోనో నడుస్తూ ఉంటాయి. దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి నేటి వరకూ అదే పరిస్థితి. అయితే మధ్యమధ్యలో కొత్త ఒరవడి సృష్టించాలని రాజకీయాలలోకి వచ్చేవారు చేసే పోరాట ఫలితంగా కొన్ని మార్పులు వస్తుంటూయి. కాని అందులోనూ కొంతైనా సర్దుబాటు లేని ప్రతీచోట వారికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. అదే భారత రాజకీయ ఎత్తుగడ. అవకాశం ఉన్న ప్రతీచోట ప్రతిపక్షాలు పాలక పక్షాలను పడేయడమే జరుగుతుంది. 
 
దేశ రాజధాని ఢిల్లీలోనైనా, ఆంధ్రప్రదేశ్ లోని నాటి తారక రామారావు సంఘటన నుంచి నేటి జగన్ సంఘటన వరకూ అన్నీ ఇవే చెపుతాయి. 'నేనింతే నేనిలాగే వెళ్ళతా'నంటే ఏ పార్టీ చూస్తూ ఊరుకోదు. తెలుసుకుని తేరుకునే లోపు ఉన్నది ఊడిపోతుంది. గుణపాఠంతోగానీ రాజకీయ పాఠాలు నేర్చుకోరు. ఇందుకు ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. తాజాగా కాంగ్రెస్ తో జతకట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
శత్రువు శత్రువు మిత్రుడంటారు. ఇది అనాదిగా వస్తున్న నానుడి. ఒక బలమైన పాలక వర్గాన్ని ఢీ కొనాలంటే రెండు శక్తులు కలవాల్సిందే. సరిగ్గా ఢిల్లీ రాజకీయాలలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన శక్తిగా ముందుకు వచ్చింది. దేశ ప్రధాని నరేంద్ర భాయ్ మోడీ ఎంతటి సామాన్యుడో అరవింద్ కేజ్రీవాల్ కూడా అంతే సామాన్యుడు అనడంలో అనుమానం లేదు. ఆయనకు కనీసం ఆర్ఎస్ఎస్, బిజేపి అండ ఉంది. 
 
కానీ కేజ్రీవాల్ కు ఆ పరిస్థితి కూడా లేదు. కానీ యువతను, నగరవాసులను కూడ్చడంలో ఆయన ఘన విజయం సాధించారు. కొడితే ఏనుగు కుంభస్తలాన్నే కొట్టాలనేది ఆయన ఆశయానికి తగ్గట్టుగానే పని చేశారు. అవినీతి వ్యతిరేకంగా, నల్లధనానికి వ్యతిరేకంగా గళం విప్పారు. పదిమందిని ఒకచోట చేర్చగలిగారు. నిర్భయ సంఘటనలో కలయికతో అర్థమయ్యింది ఢిల్లీ యువత ఎంతటి చిర్రెత్తి ఉందో సరిగ్గా ఇలాంటి సమయంలోనే వారికి అరవింద్ కే్జ్రీవాల్ పెట్టిన పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపించింది. 
 
ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బిజెపికి 31, ఆప్ కి 28, కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల తరువాత కేజ్రీవాల్ పేరు దేశమంతటా మార్మోగింది. గెలుపుతో ఆప్ ఢిల్లీలో తిష్ట వేసింది. అయితే ఆ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. మాజిక్ సంఖ్య రావాలంటే రెండు పార్టీలు కలవాల్సింది. అయితే ఇతరులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఏ మాత్రం ఇష్టం లేని కేజ్రీవాల్ అయిష్టంగానే కాంగ్రెస్ తో కాపురమైతే పెట్టాల్సి వచ్చింది. అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేజ్రీవాల్ ఆందోళనకు దిగి అభాసుపాలయ్యారు. కానీ పొత్తు ఎక్కువకాలం పొసగలేదు. 49 రోజులకే ఆప్ నేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. దీనితో అసెంబ్లీ ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉంది. 
 
కొన్ని స్వయంకృతాపరాధాలు చేశారు. అధికారంలో ఉండీ ఆందోళనలకు దిగడం. కొనసాగే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వంటి పనులు ఆయన అనుభవరాహిత్యాన్ని చెప్పకనే చెప్పాయి. తన వెనుక ఉన్న యువతను చూసిన కేజ్రీవాల్ అందివచ్చిన అవకాశంతో వారికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఆ పర్యావసానం పార్లమెంటు ఎన్నికలలో స్పష్టంగా చవిచూశారు. ఇక్కడి ఓటమితో గుణపాఠం నేర్చుకున్నారు. సరిగ్గా ఎన్టీ రామారావు కూడా ఉప్పెనలా వచ్చారు. 
 
అలాగే రాజకీయ క్రీనీడలో పావుగా మిగిలారు. అయితే ఇక్కడ సంఘటనలు పరిస్థితులు వేరయినప్పటికీ పార్టీ తీరు ఒక్కటే. అవకాశం వచ్చినప్పుడు అధికార పార్టీ చావుదెబ్బ కొట్టడం. ఇది భారత రాజకీయాలలో పరిపాటిగా మారిందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే చతురుతను ప్రదర్శించిన వారు బయటపడి ఇటు జనానికి అటు రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వగలిగారు. కాదని మొండిగా వ్యవహరించిన వారు రాజకీయ కల్లోలానికి కారకులుగా మిగిలిపోయారు. ఢిల్లీలోని ప్రస్తుత స్థితి నూటికి నూరుపాళ్ళు కేజ్రీ వాల్ కారణం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నాటి ఆయన తీరు కారణంగా ఢిల్లీలో కల్లోల స్థితులు ఉన్నాయి. శాసన వ్యవస్థ సుప్తచేతనావస్థలోకి వెళ్ళి పోయింది. 
 
ఇదిలా ఉండగానే కేజ్రీవాల్ బిజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర భాయ్ మోడీపై పోటీ దిగారు. ఓటమి చవి చూసిన తరువాతగానీ ఆయనకు వాస్తవ పరిస్థితులు కనిపించలేదు. ‘ఏమి చేస్తున్నావు కోడలా’అంటే ‘ఉన్నవి ఉలగబోసి ఎత్తుకుంటున్నానత్తా’అందట వెనకటికి ఓ కోడలు. సరిగ్గా కేజ్రీవాల్ స్థితి కూడా ఇలాగే ఉంది. తిరిగి ఢిల్లీలో పాలనాపగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 
 
కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు కలిస్తే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేడయం సాధ్యం కాదు.  అలాగని ఎన్నికలకు వెళ్లితే తెలిసి తెలిసి చేతులు కాల్చుకోవడం మినహా మరోటి కాదు. ఈ విషయం ఇటు కేజ్రీవాల్ కు పార్లమెంటు ఎన్నికల తరువాత బోధపడింది. కాదని మొండిగా వెళ్ళితే తాను చేయాలనుకున్న మేలు కూడా చేసే పరిస్థితి లేకపోవచ్చు. ఇలాంటి స్థితిలో బీజేపీని ఎదురొడ్డి నిలబడాలంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గం. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఇదే భావనలో ఉంది. 
 
బీజేపీని ఎదుర్కోవాలంటే చేతికి అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కాలదన్నుకోరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో కేజ్రీవాల్ తో జతకట్టాలని భావిస్తున్నారు. కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనీసం పరువైనా దక్కుతుంది. దేశ రాజధానిలో తలెత్తుకు తిరగవచ్చుని ఎన్నికల గుణపాఠం నుంచి నేర్చుకున్న పాఠం ద్వారా తెలుసుకున్నారు. ఇప్పటికే రహస్యంగా మధ్యవర్తిత్వం నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేజ్రీవాల్ మరో ట్విస్టు పెట్టినట్లు సమాచారం. ఆయన బుధవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హస్తానికి చేయిచ్చి కమలంతో కలిసి వెళ్లే అవకాశం లేకపోలేదు. మొత్తమ్మీద ఢిల్లీ పీఠంను వదులుకున్నాక గాని కేజ్రీవాల్ కు రాజకీయాల్లో అసలు పరిస్థితి ఎలా ఉంటుందన్నది తెలియరాలేదు.

- పుత్తా యర్రంరెడ్డి(తిరుపతి)

వెబ్దునియా పై చదవండి