స్థానిక ఎన్నికలకు జనసేన ‘సై’ అంటుందా... చంద్రబాబు పంచన చేరుతుందా...?

మంగళవారం, 18 అక్టోబరు 2016 (14:09 IST)
రాజ‌కీయ పార్టీగా అవిర్భ‌వించినా ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించ‌ని జ‌న‌సేన పార్టీ తొలిసారిగా ఎన్నిక‌ల గోదాలోకి దిగ‌బోతోందా? ఆ పార్టీ రాజ‌కీయ తొలి రాజ‌కీయ ప్ర‌త్య‌క్ష పోరుకు జీవీఎంసీ ఎన్నిక‌లు వేదిక కాబోతోన్నాయా? ఈ వార్త‌లు నిజ‌మేనా? లేక ప్ర‌స్తుతానికి ఊహాగానాలేనా? ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానం కోసం ప్ర‌స్తుతం.. ఏపీలో చాలామందికి ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. జన‌సేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కొద్దిరోజుల క్రితం విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొనడంతో ఈ ఊహాగానాలు ప్రజల్లో మరెంత పెరిగాయి. 
 
ఒకేసారి సాధారణ ఎన్నికల బరిలో దిగడంకంటే, అంతకుముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలుంటుందనే భావనలో పార్టీ అధినేత వున్నట్టు సమాచారం. అయితే జ‌న‌సేన సొంతంగానే పోటీ చేస్తుందా? లేక పొత్తుల‌తో బరిలోకి దిగుతుందా? అన్న అంశంపై ఇంకా స్ప‌ష్టత లేదు. అయితే ప‌వ‌న్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి త‌న స‌త్తా చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఆయ‌న అభిమానుల్లో మాత్రం ఈ వార్త‌లు మంచి ఉత్సాహాన్ని నింపాయ‌నే చెప్పాలి.
 
మహా నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలపై జనసేన పార్టీ గురిపెట్టింద‌ని తాజాగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని అభిమాన గ‌ణం ఉన్న ప‌వ‌ర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ జనసేన పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి స‌రిగ్గా రెండున్న‌రేళ్లు గ‌డిచింది. నాటి సాధారణ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని అంతా భావించినా, పార్టీ నిర్మాణం పూర్తిగా జరగనందున బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి అడ‌పాదడపా రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు త‌ప్ప ఇటీవ‌లికాలం వ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయ ల‌క్ష్యం ఏమిటో బ‌య‌ట‌పెట్ట‌లేద‌నే చెప్పాలి. అయితే కొద్దిరోజుల క్రితం తిరుప‌తి, అ త‌రువాత కాకినాడ‌లో బ‌హిరంగ స‌భ‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీకి తన పార్టీ సిద్ధ‌మ‌వుతోంద‌నే సంకేతాల‌ను ప్ర‌జల్లోకి పంపారు.
 
ఇదే స‌మ‌యంలో మేయర్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటం ఈ అంశంలో మ‌రింత గందరగోళానికి తావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు గత ఏడాది లోనే జరగాల్సినా, వాటిని వాయిదా వేస్తూ వస్తుంది ఏపీ సర్కార్. అయితే ఇప్పటికిప్పుడే జీవీఎంసీ ఎన్నికల్లోకి వెళ్లితే ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు మరికొద్ది రోజులు వాయిదా వేస్తే బాగుంటుందన్న భావనలో ఉన్నారు. ఇక ఎన్నికల్లోకి వెళ్లడం అనివార్యం కావడంతో చేసేది ఏమీలేక ఎన్నికలకు సన్నద్ధం చేస్తోంది. ఇక ఇదే విషయంలో అన్ని పార్టీలు ఎన్నికలను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన సైతం ఎన్నికలకు సై అంటున్నట్టుగా వినికిడి.
 
ఇప్ప‌టికే విశాఖ నగరంలో జనసేన కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కొద్దిరోజుల నుంచి తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ జ‌యంతి రోజున కూడా కొన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇవ‌న్నీ ఆ పార్టీ ప్ర‌జల్లోకి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌నేందుకు సూచ‌న‌లుగానే భావిస్తున్నారు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌కారం.. కాపు సామాజికవ‌ర్గం బ‌లంగా ఉన్న విశాఖ‌, కాకినాడ‌, గుంటూరు స్థానాల్లో పార్టీకి మంచి అవ‌కాశాలున్న‌ట్టు ప‌వ‌న్‌కు స‌న్నిహితులు చెపుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి మిత్రప‌క్షాల‌తో పొత్తు ఉండే ప‌క్షంలో ఈ స్థానాల‌ను త‌మ పార్టీకి ఇవ్వాల‌ని ప‌వ‌న్ కోరే అవ‌కాశముందా అనే అంశంపై కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో తాజాగా చ‌ర్చ జరుగుతోంది. మొత్తం మీద ఏపీ భ‌విష్య‌త్ రాజ‌కీయ ముఖ చిత్రం ఎలా ఉండ‌బోతుందో జీవీఎంసీ ఎన్నిక‌లు చూశాక తేలిపోనున్న‌ద‌న్న‌మాట‌.

వెబ్దునియా పై చదవండి