అర్థం చేసుకోండి.. అందరం కలసిపోదాం: శ్రీజ

శనివారం, 27 అక్టోబరు 2007 (14:58 IST)
తన కుటుంబ సభ్యులు తమ ప్రేమను అర్థం చేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ మరోసారి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసింది. ఇరువురు కుటుంబ సభ్యులు ఒక అవగాహనకు వస్తే.. రెండు కుటుంబాలు కలసి పోవచ్చని ఆమె సూచించింది. ఢిల్లీలో ఉంటున్న శ్రీజ దంపతులు శుక్రవారం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం. తన తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాం అయితే.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే.. మనస్పూర్తిగా క్షమించమని అడుగుతున్నాం. అయితే.. అత్తమామయ్య వాళ్లు మాత్రం త్వరగా ఇంటికి రమ్మంటున్నారు. మా కుటుంబం తరపు నుంచే ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయినప్పటికీ త్వరలోనే హైదరాబాద్‌కు వెళ్లి, శిరీష్ (అత్తగారింట్లో) ఇంట్లోనే కాపురం పెడతాం అని శ్రీజ చెప్పింది.

అనంతరం శిరీష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. మా పెళ్లిని వారు స్వాగతించారు. త్వరగా హైదరాబాద్‌కు రమ్మని చెప్పారు. రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాం కాబట్టి అందరికీ బాధగానే ఉంటుంది. అందరికీ సారీ చెబుతున్నాం అని అన్నాడు. కాగా శ్రీజ దంపతుల వెంట ఒక గన్‌మెన్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి