కవలలు ఎలా పుడతారు....?

ఒకేమారు ఇద్దరు బిడ్డలకు తండ్రి లేదా తల్లి అయితే.... ఇంకేముంది. అదే చాలా మందికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ఆడ బిడ్డ, ఒక మగ బిడ్డ అయితే మరీ ఆనందం. ఎవరు ఏమన్నా ఇది మన సమాజంలో ఉన్న పరిస్థితి. ఇలా ఇద్దరు పిల్లలు ఒకే మారు జన్మించడాన్ని కవలలు అని అంటాం. సాధారణంగా సామన్యులు ఇంతవరకే ఆగుతారు.

కానీ, కవలలు ఎందుకు పుడతారు...? ఎలా సాధ్యం...? ఇలాంటి ప్రశ్నలు సామాన్యులకు అంతు చిక్కని విషయాలు. ఇంత ఆనందకరమైన విషయం తెలియకుండానే జీవితాలను గడిపేస్తారు. జీవితంలోనే కాకుండాతల్లికడుపులో కూడా ఒకేమారు పెరిగామనే విషయం ఆ పిల్లలకూ తెలియదు.

ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటి అనే అలోచిస్తే శాస్త్ర ప్రకారం ప్రతీ దానికి సమాధానం దొరుకుతుంది. కవల పిల్లలైనా, అంతకంటే ఎక్కువ మందైనా ఒకే మారు పుట్టడానికి అండాల విడుదలే కారణం. సాధారణంగా అమ్మాయి రసజ్వల అయినప్పటి నుంచి బహిస్టు అయిన ప్రతి నెల ఒక అండం విడుదల అవుతుంది.

అదే సమయంలో మగవారిలోని వీర్య కణాలతో కలసి ఫలదీకరణం చెంది పిల్లలు పుడుతారు. సాధారణ పరిస్థితులలో ఇలా జరుగుతుంది. అండం విడుదల అనేది ఒక్క నెల ఎడమ అండాశయం నుంచి విడుదలైతే, మరో నెల కుడివైపు అండాశయం నుంచి జరుగుతుంది.

ఇది ఒక్కొక్కమారు రెండు అండాశయాల నుంచి అండాలు విడుదల అవుతాయి. ఈ అండాలను రెండు వీర్యకణాలు వేర్వేరుగా కలవడం వలన రెండు ఫలదీకరణాలు జరుగుతాయి. ఫలితంగా కవలలు జన్మిస్తారు. ఇక్కడ ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ లేదా ఒక ఆడ, ఒక మగ పుడుతారు. కవలలు జన్మనివ్వడమనేది వంశపారంపర్యంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది.

కవలలు ఒకే రూపంలో పుడతారు ఎలా..?
ఇది కూడా సరైన సందేహమే అవుతుంది. కవలలు జన్మించిన అన్ని సంఘటనలలోనూ పుట్టిన పిల్లలు ఒకే రూపులో ఉండరు. అరుదైన సందర్భాలలో ఒకే రూపులో ఉంటారు. మరి ఇది ఎలా జరుగుతుంది. అండం ఫలదీకరణం చెందినా రెండు భాగాలుగా విడిపోతుంది. అపుడు కూడా ఇద్దరు పిల్లలు పుడుతారు.

ఈ సందర్భంలో ఇద్దరు పిల్లలు పుడితే దాదాపుగా ఒకే పోలికలు కలిగి ఉంటారు. ఈ సందర్భంలో పుడితే ఇద్దరూ ఆడ లేదా ఇద్దరూ మగ పిల్లలు పుడతారు. అదండీ... సంగతి కవలలు ఇలా పుడతారన్నమాట.

వెబ్దునియా పై చదవండి