ఆస్టియోపెట్రోసిస్‌తో బాధపడుతున్న బాలునికి మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవంతంగా శస్త్రచికిత్స

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:51 IST)
ఆస్టియోపెట్రోసిస్‌ లేదా అల్బర్స్-స్కాన్‌బెర్గ్‌గా వ్యవహరించే అత్యంత అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న 15 సంవత్సరాల బాలుడు కె హర్షవర్ధన్‌కు విజయవంతంగా చికిత్సనందించింది మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ. కన్సల్టెంట్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ రవికాంత్‌‌ను ఈ రోగి సంప్రదించగా, తొలుత ఈ వ్యాధిని గుర్తించిన ఆయన కన్సల్టెంట్‌ ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వీవీకె సందీప్‌కు తదుపరి పరీక్షల కోసం సంప్రదించాల్సిందిగా సూచించారు.
 
ఈ కేసు గురించి డాక్టర్‌ వీవీకె సందీప్‌ మాట్లాడుతూ, ‘‘ఈ రోగి మా దగ్గరకు నేత్ర దృష్టి లోపంతో పాటుగా శారీరకంగా ఎదుగుదల లేని స్థితిలో వచ్చాడు. అతని ఎడమ కంటిలో నొప్పితో పాటుగా గత రెండు నెలలుగా తలనొప్పితో బాధపడుతున్నాడు. దీనికితోడు అతనికి హైడ్రోసెఫాలస్‌ (మెదడు లోపల వెంట్రికల్స్‌లో అసాధారణంగా ఫ్లూయిడ్‌ నిలిచిపోతుంది) చరిత్ర ఉంది. అతనికి లాపరోటమీ మిడ్‌గట్‌ వోల్వులస్‌ రిడక్షన్‌ (ప్రేగులలో అసాధారణతల చికిత్సకు) మరియు లాడ్స్‌ ప్రొసీజర్‌(ప్రేగులను సరిచేయడం)ను 2006లో చేశారు. మేము రోగికి ఎండోస్కోపీతో ఆప్టిక్‌ నెర్వ్‌ డీకంప్రెషన్‌, నేవిగేషన్‌ గైడెన్స్‌ ద్వారా చికిత్స చేశాము’’ అని అన్నారు.
 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘ఇది అత్యంత అరుదైన వ్యాధి. దాదాపు 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇది కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధికి చికిత్స చేయడం ఇదే తొలిసారి. అత్యంత విజయవంతంగా ఈ శస్త్ర చికిత్స చేయడంతో పాటుగా రోగి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచిన డాక్టర్‌ వీవీకె సందీప్‌, అతని బృందాన్ని అభినందిస్తున్నాను. మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ వద్ద ఎలాంటి ఆరోగ్య సమస్య లేదా తీవ్ర అనారోగ్య స్థితికి అయినా సరే చికిత్సనందించే అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయి. తద్వారా ఈ తరహా చికిత్సల కోసం రోగులు సుదూర ప్రాంతాలకు పయణించవలసిన అవసరం లేదు’’ అని అన్నారు
 
హర్ష వర్థన్‌ మాతృమూర్తి శ్రీమతి వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ‘‘మా అబ్బాయికి చిన్నతనం నుంచి ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. తరచుగా తలనొప్పి అని చెబుతుండేవాడు. చెవి నుంచి చీము కారుతుండేది. దీనికితోడు ముక్కు కూడా ఎప్పుడూ కారుతూనే ఉండేది. మేము ఈ సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఎన్నో హాస్పటల్స్‌ తిరిగాము కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. మేము డాక్టర్‌ రవికాంత్‌ను కలిసినప్పుడు ఆయన మాకు డాక్టర్‌ సందీప్‌ను కలువాల్సిందిగా సూచించారు. ఆయన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. మా అబ్బాయిని కాపాడటంతో పాటుగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దిన డాక్టర్‌ సందీప్‌కు మరియు మణిపాల్‌ హాస్పిటల్స్‌ డాక్టర్లకు మేమెప్పుడూ ఋణపడి ఉంటాము’’ అని అన్నారు.
 
డాకర్ల బృందంలో కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ కూడా ఉన్నారు. ఈ బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది మరియు అవసరమైన పరీక్షలు చేసిన తరువాత అతనిని డిశ్చార్జ్‌ చేశాము. రాబోయే కొద్ది రోజులు ఈ బాలుడిని డాక్టర్లు పర్యవేక్షించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు