ప్రాణాలు తీసే విషంతోనే ప్రాణాంతక వ్యాధికి మందు.. ఏంటది?

గురువారం, 7 ఏప్రియల్ 2016 (15:35 IST)
ఎయిడ్స్ ఒక ప్రాణాంతకమైన, చికిత్సలేని సుఖవ్యాధి. ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ (హెచ్.ఐ.వి.) ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ కారణంగా మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా క్షీణించి పోయి హెచ్.ఐ.వి. సోకిన వ్యక్తి వివిధ వ్యాధులకు గురవుతాడు. అటువంటి వాటిలో ప్రధానంగా క్షయ, న్యూమోనియాకు సంబంధించిన న్యూమోసిస్టస్ కార్నియో, చర్మం మీద కంతులుగా ఏర్పడే కాషాసిస్ సార్కొమా, హెర్పిస్, షింగిల్స్, క్రిప్టోస్నోరియాసిస్ వంటి అంటు వ్యాధులు కలుగుతాయి. ప్రారంభంలో ముంబై, చెన్నైలలో సెక్స్ వర్కర్లు, యువతలో ఎయిడ్స్ సోకిన కేసులు ఎక్కువగా కన్పించగా, ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎయిడ్స్ మహమ్మారి శీఘ్రంగా వ్యాపిస్తోంది. సెక్స్ వర్కర్లు, రెడ్ లైట్ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు అధికంగా ఉండే రాష్ట్రాలలోనే ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. 
 
ఈ వ్యాధి బారిన పడినవారికి సరైన చికిత్సలు, మందులు లేక చనిపోతున్నారు. అయితే అటువంటి వారికి ఉపశమనం కలిగించే విధంగా పాము విషం నుండి మందును తయారు చేస్తున్నారు. ఈ ఔషధాన్ని తయారు చేసేది విదేశీయులు కాదు మన భారతీయులే కావడం గర్వ కారణం. ఈ ఔషధం ఎయిడ్స్ వ్యాధికి బాగా పనిచేస్తోందని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (iict) సంస్థ ధ్రువీకరించింది.
 
దీనిపై గత 6 నెలలుగా హైదరాబాద్ రామంతపూర్‌లోని హోమియో ఆసుపత్రిలో సుమారు 3 వేల మంది ఎయిడ్స్ బాధితులపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో మందు వాడుతున్న వారిలో సీడీ-4 (రోగనిరోధక శక్తిని పెంచే) సెల్స్ కౌంట్ పెరుగుతున్నట్టు గుర్తించారు. అంతేకాదు వీరిలో సుమారు 10 మందిలో హెచ్ఐవీ వైరస్ జీరో అయినట్టు పరీక్షల్లో వెల్లడైంది. 
 
ఈ ఔషధం ఖరీదు చాలా తక్కువని, ఒక్కో డోస్ సుమారు 50 పైసల నుంచి ఒక్క రూపాయిలోపుగానే ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ ప్రయోగాలపై మరింత స్పష్టత వచ్చిన తర్వాత మందు వాడకంపై మెడికల్ బోర్డు పరిధిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రాణాలు తీసే పాము విషమే… ఆ ప్రాణాంతక వ్యాధికి మందు కానుంది. 

వెబ్దునియా పై చదవండి