ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే..?

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (15:17 IST)
ఆంజనేయుడు సీతారాములవారికి ప్రియమైన భక్తుడు. అలాంటి స్వామివారిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. హనుమంతునికి తమలపాకుల పూజ చేసేందుకు ఓ కారణం ఉంది. అందేటంటే.. ఓసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామునిని స్వామీ ఏమిటది..? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది..? అని అడిగారు.
 
అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుండి వెళ్లి కాసేపటికి శరీరమంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు.
 
హనుమంతుడు రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో స్వామివారిని పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. 
 
హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు. అలానే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి పండ్లు, తమలపాకులు దక్షిణ భాగంలో దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు