కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక సోమవారం తరహాలోనే కార్తీక శుక్రవారం పూట సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారాల వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి.. లక్ష్మీదేవి, శివపార్వతీదేవీలను అర్చించినట్లైతే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. కార్తీక శుక్రవారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి. ఈ రోజున ఒకపూట మాత్రమే భోంజేసి ఉపవాసముండాలి. అయితే... అరటి పండ్లను మాత్రం తీసుకోవచ్చు. లేదా పాయసం బొబ్బర్లతో కూడిన వంటల్ని భుజించవచ్చు.
కార్తీక శుక్రవారం స్త్రీలు తెల్లపువ్వులను, కుంకుమ రంగులో గల పువ్వులను ధరించి లక్ష్మీదేవి, పార్వతీదేవిలను అర్చించుకుంటే దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని నమ్మకం. సాయంత్రం ఆరు గంటల సమయానికి ఇంటి ముగిలిని రంగవల్లిలకలతో అలంకరించి.. వాటిపై దీపాలను వెలిగించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, పుష్పాలతో అలంకరించుకుని పొంగలిని నైవేద్యంగా సమర్పించి.. దీపారాధన చేయాలి. పూజకు నేతిని.. ఇంటి ముందు నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
"చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్'' అనే మంత్రాన్ని రెండుసార్లు పఠించాలి. ఆపై ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని, పార్వతీదేవి ఆలయాలను, శివాలయాలను సందర్శించుకోవడం ద్వారా సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.