భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్ మరో మారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. 2006వ సంవత్సరంలో ఆరు నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో పనిచేసిన సునీత విలియమ్ వ్యోమగామిగా గతంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జులై నెలలో మరోమారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. కజక్‌స్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి జులై 14వ తేదీన విలియమ్స్ అంతరిక్ష యాత్ర ప్రారంభమవుతుంది. రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇంజనీర్ యూరి మాలెన్కెక్, జపాన్ ఎరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన ఇంజనీర్ అఖికో హోషైడ్‌లతో కలిసి విలియమ్స్ అంతరిక్ష యాత్ర చేపడుతున్నారని నాసా తెలిపింది.
విలియమ్స్ 1998లో ఒక వ్యోమగామిగా నాసా ఎంపికచేసింది. విలియమ్స్ తండ్రి గుజరాత్‌కు చెందిన వారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చెందిన అన్వేషణ-14లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆ తర్వాత అన్వేషణ-15లో పాలుపంచుకున్నారు. మహిళా అంతరిక్ష ప్రయాణికులలో సుదీర్ఘకాలం అంతరిక్షంలో ప్రయాణం చేసిన మహిళగా విలియమ్స్ రికార్డు సాధించారు.