ఆరు ముస్లిం దేశాలపై నిషేధం, వీసా నిబంధనల్లో మార్పులు, సరిహద్దు గోడ నిర్మాణం వంటి నిర్ణయాలతో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లల్లో నానుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అమెరికా ఉన్నతాధికారులను ఆందోళనలకు గురిచేస్తోంది. ట్రంప్ నేరుగా ఫోన్ చేయాలని నాయకులకు, అధికారులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మెక్సికో, కెనడా ప్రధానులకు తన ఫోన్ నెంబర్‌ను ఇచ్చారు.
ఈ అవకాశాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడే బాగానే ఉపయోగించుకున్నారు. ట్రంప్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ట్రంప్‌తో నేరుగా నేతలు ఫోనులో మాట్లాడటం ద్వారా దౌత్యపరమైన రహస్యాలు, భద్రతా చర్యలకు ఆటంకం కలిగే అవకాశం లేకపోలేదని అమెరికా కమ్యూనికేషన్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ట్రంప్ ఫోటో కాల్‌ను పక్కనబెట్టి నేతలతో ఫోనులో మాట్లాడటం భద్రతా పరంగా మంచిది కాదని కమ్యూనికేషన్స్ అధికారులు అంటున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో ప్రధాన మంత్రులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చిన ట్రంప్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రోన్‌కు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు.